Renkoji temple ashes: టోక్యోలోని రెంకోజీ మందిరంలో సుభాష్ చంద్రబోస్ అస్థికలుగా చెబుతున్న వాటికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఆ ఆలయ ప్రధాన పూజారి అనుమతిచ్చారా..? అయినా బోస్ మరణంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిటీ నిర్లక్ష్యం వహించిందా...? అవుననే అంటున్నారు నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవరాలు మాధురీ బోస్.
Netaji Ashes DNA test
"అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు చేసేందుకు రెంకోజీ పూజారి అనుమతిచ్చారు. ఈ మేరకు 2005లో లేఖ రాశారు. దాన్ని ముఖర్జీ కమిషన్ అనువాదం చేయలేదు. తన నివేదికలోనూ ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. పరీక్షల విషయంలో రెంకోజీ ఆలయ అధికారులు మౌనం వహించడంతో తాము ముందుకు వెళ్లలేకపోయామని మాత్రమే కమిషన్ పేర్కొంది. ఇది వాస్తవం కాదు. జపాన్ భాషలో ఉన్న పూజారి లేఖను అనువాదం చేయించాం. అందులో డీఎన్‌ఏ పరీక్షలకు తాను అనుమతిచ్చినట్లు పూజారి స్పష్టంగా పేర్కొన్నారు" అని మాధురీ బోస్ తెలిపారు.
Netaji Death mystery
నేతాజీ అదృశ్యంపై న్యాయమూర్తి ఎం.కె.ముఖర్జీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తన నివేదికను 2006లో పార్లమెంట్‌కు సమర్పించింది. అందులో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని పేర్కొంది. దీంతో నేతాజీ అదృశ్యంపై మరిన్ని అనుమానాలు రేకెత్తాయి.
ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, సన్యాసిగా తిరుగుతున్నారని, రష్యా ప్రభుత్వం జైల్లో నిర్బంధించిందని.. ఇలా రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. రెంకోజీ మందిరంలో అస్థికలు నేతాజీవి కావని ముఖర్జీ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అయితే పూజారి లేఖ.. నివేదికపై సందేహాలను లేవనెత్తుతోంది. "పరీక్షలకు సహకారం అందించటానికి అంగీకరిస్తున్నా. ఇదే విషయాన్ని జపాన్‌లోని భారత రాయబారి ఎం.ఎల్.త్రిపాఠి సమక్షంలోనూ చెప్పాను" అని లేఖలో పూజారి నిచికో మోచీచుకీ పేర్కొన్నట్లు మాధురీ చెప్పారు. దీన్ని ఎందుకు బహిరంగం చేయలేదో, డీఎన్‌ఏ పరీక్షలు ఎందుకు నిర్వహించ లేదో అర్థం కాలేదని ఆమె పేర్కొన్నారు.
పరీక్షలు చేయకపోవడంతో మందిరంలోని అస్థికలు నేతాజీవేనని తాను నమ్ముతున్నానని లేఖలో పూజారి పేర్కొనడం గమనార్హం. తన తండ్రి నిద్రపోయే సమయంలోనూ అస్థికల కలశాన్ని తనకు దగ్గరగా పెట్టుకొనేవారని, ఎవరైనా వాటిని మార్చివేస్తారేమోనని భయపడేవారని మోచీచుకీ చెప్పారు. గతంలోనూ తమ కుటుంబసభ్యులు ఆలయంలోని అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామని.. అయినా ఎలాంటి స్పందన రాలేదని మాధురీ బోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'నేతాజీ మరణంపై ఆ నివేదికను నమ్మలేం!'