Azadi Ka Amrit Mahotsav: పదిహేడో శతాబ్ది తొలినాళ్ల సమయమది. మొఘల్ సామ్రాజ్యం బలహీన పడుతున్న దశ. అప్పటికే.. డచ్, ఫ్రెంచ్, పోర్చుగీసులు భారత్‌లో, చుట్టుపక్కల సముద్రజలాల్లో వాణిజ్యంపై పట్టుకు ప్రయత్నిస్తున్నారు. వీరందరి తర్వాత ఆలస్యంగా వచ్చిన ఆంగ్లేయులు పశ్చిమ ప్రాంతాల్లో కొన్ని చోట్లకే పరిమితమయ్యారు. అదీ మొఘల్ రాజుల కనుసన్నల్లో!
తూర్పుతీరంలో ముఖ్యంగా హుగ్లీ (బెంగాల్) వైపు పోర్చుగీసు వాణిజ్యం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతుండటంతో... ఆంగ్లేయులకు కన్నుకుట్టింది. అక్కడా తాము కాలుమోపాలనుకొని.. ఈస్టిండియా కంపెనీ ప్రతినిధి విలియమ్ హెడ్జెస్‌ను 1682లో బెంగాల్ (మొఘల్)రాజు షాయిస్తాఖాన్ వద్దకు పంపించారు. మొఘల్ పాలనలోని అన్ని ప్రాంతాల్లో తాము వ్యాపారం చేసుకోవటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి తోడు తమ వస్తువులపై ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంగ్లేయులు అడిగే పద్ధతి నచ్చని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇందుకు నిరాకరించాడు. చర్చలు విఫలమయ్యాయి. ఆ సమయంలో ఈస్టిండియా కంపెనీ ముంబయి గవర్నర్‌గా ఉన్న సర్ జోసియా చైల్డ్... ఆగ్రహంతో ఔరంగజేబుపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. మొఘల్‌ల వాణిజ్య ఓడలను తెల్లవారు అటకాయించి దోచుకోవటం ఆరంభించారు. అంతేగాకుండా మక్కా పర్యటనకు వెళుతున్న ఓడలను కూడా దోపిడీ చేశారు. చిట్టగాంగ్‌ను (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించుకొని బంగాళాఖాతంలో వాణిజ్యంపై పట్టుబిగించాలని వ్యూహం రచించారు.
ఈ మేరకు 1685లో అడ్మిరల్ నికోల్సన్ 12 పడవల్లో వెయ్యిమంది సైనికులతో చిట్టగాంగ్‌పై దాడికి వచ్చాడు. కానీ... దారితప్పి హుగ్లికి చేరుకున్నాడు. అక్కడ మొఘల్ అధికారులకు, ఆంగ్లేయులకు మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఒకవైపు ఇలా మొఘల్‌లను ఇబ్బంది పెడుతూనే... మరోవైపు చర్చలు సాగదీశారు ఆంగ్లేయులు. కారణం మరింత సైన్యాన్ని కూడగట్టు కోవటం కోసమే. 1688లో మద్రాసు నుంచి కెప్టెన్ హీత్ ఆధ్వర్యంలో సైన్యం బాలాసోర్, చిట్టగాంగ్‌లపై విరుచుకుపడింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేక మద్రాసుకు తిరుగుముఖం పట్టింది.
ఈ సంఘటనలన్నింటితో ఆగ్రహించిన ఔరంగజేబు... భారత్‌లో ఈస్టిండియా కంపెనీ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేశాడు. ఫలితంగా.. ముంబయి, మద్రాసు తప్పిస్తే... అన్ని చోట్లా కంపెనీ ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. సిబ్బందిని, వారి సైనికులను నిర్బంధించారు. చేశారు. 1689లో మొఘల్ సైన్యాధిపతి సిది యాకుబ్ సారథ్యంలోని నౌకాదళం ముంబయిలోని ఈస్టిండియా కంపెనీపైనా దాడి చేసింది. ఆంగ్లేయులు తీవ్రంగా ప్రతిఘటించినా అదే సమయంలో వచ్చిన క్షామం దెబ్బతీసింది. ఫలితంగా... ఈస్టిండియా కంపెనీ లొంగిపోయింది. తప్పైందని... క్షమించమని కోరుతూ... 1690లో ఔరంగజేబు ముందు ప్రాధేయపడింది. తమ ఆస్తులను విడిచిపెట్టాలని... వాణిజ్యం చేసుకునేందుకు తిరిగి అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడి బతిమిలాడింది.
ఆ కాలంలోనే లక్షన్నర రూపాయల జరిమానా చెల్లించటానికి సిద్ధపడింది. అంతేగాకుండా మునుముందు తమ ప్రవర్తన మార్చుకుంటామని హామీ ఇచ్చింది. మెత్తబడ్డ ఔరంగజేబు ఈస్టిండియా కంపెనీ ఆస్తులకు, సిబ్బందికి విముక్తి ప్రకటించాడు.