కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో ప్రస్తుతం మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ఇన్‌ఫెక్షన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా బ్లాక్‌ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోల్‌కతాలోని జీడీ హస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ అవదేశ్ కుమార్‌సింగ్, డాక్టర్ రితుసింగ్, ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ శశాంక్ జోషి, దిల్లీలోని నేషనల్ డయాబెటిస్, ఒబేసిటీ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రా సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు.
అరుదైన ఇన్‌ఫెక్షన్
అరుదుగా వచ్చే ఈ ఇన్‌ఫెక్షన్ ప్రమాదకరమైందని వారు వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల ఆధారంగా పరిశీలిస్తే వారిలో 79శాతం మంది పురుషులే ఉన్నట్లు వారు తెలిపారు. ఇది సోకిన వందమందిలో 83 మంది షుగర్ వ్యాధిగ్రస్తులేనని తేలిందన్నారు. వీరిలో మరణాల శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న డయాబెటిక్ పేషెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచించారు. కరోనా పూర్తిగా తగ్గక ముందే శరీరం ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుండగా, కొవిడ్ తగ్గాకనే వ్యాధి బయటపడుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధనలో భారత్‌తో సహా అమెరికా, ఇరాన్‌లో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ రోగులను పరిశీలించామని పేర్కొన్నారు.