తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాలి ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి- వాటిపైనా ప్రభావం! - మేదాంత ఆస్పత్రి

దేశంలో ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న బ్లాక్​ ఫంగస్​ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు వైద్యులు. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే.. దానిని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. ఇంకా.. ఈ మ్యుకర్​మైకోసిస్ దవడ ఎముకలు, దంతాలు, చిన్న పేగులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించారు. సకాలంలో చికిత్స తీసుకుంటే.. వ్యాధిని నయం చేయొచ్చని స్పష్టం చేశారు.

Mucor can spread through air
గాలి ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి

By

Published : May 22, 2021, 5:02 PM IST

కరోనాను జయించినవారిని కలవరపెడుతున్న బ్లాక్​ ఫంగస్​(మ్యుకర్​మైకోసిస్​) గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారిలో అది ఎలాంటి ప్రభావం కలిగించదని తెలిపారు.

''బ్లాక్​ ఫంగస్​ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది. అయితే.. ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఇది ఎలాంటి ప్రభావం చూపించదు. ఇది ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించవచ్చు. కానీ అవకాశాలు చాలా తక్కువ. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే.. మనం దానితో పోరాడవచ్చు.''

- డా. నిఖిల్​ టాండన్​, ఎయిమ్స్​ వైద్యులు

మ్యుకర్​మైకోసిస్​ కారణంగా అంధత్వం మాత్రమే కాకుండా.. పళ్లు, దవడలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని తొలగించాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపారు. అయితే.. సకాలంలో చికిత్స చేస్తే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. సైనస్​ నుంచి ప్రారంభమై.. మెల్లగా దవడల్లో నొప్పి మొదలవుతుందని, ఆ తర్వాత ఎముకలు క్షీణిస్తాయని ప్రముఖ దంతవైద్య నిపుణులు డా. నేహల్​ పటేల్​ పేర్కొన్నారు.

''నా ముఖం ఎడమభాగం తిమ్మిరిపట్టింది. కళ్ల నుంచి నీరు కారడం, ఎర్రగా మారడం కనిపించాయి. నా పైదవడ ఎడమవైపున్న పళ్లు కూడా మొద్దుబారిపోయాయి. ఇప్పుడు కాస్త బాగానే ఉన్నాను. నాకు శస్త్రచికిత్స జరిగింది.''

- పుష్కర్​ సారన్​, బాధితుడు

చిన్న పేగుల్లోనూ..

బ్లాక్​ ఫంగస్​ చిన్నపేగుల్లోనూ వెలుగుచూస్తున్నట్లు దిల్లీలోని శ్రీ గంగారాం ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. కొవిడ్​ బారిన పడిన ఓ వ్యక్తికి.. సీటీ స్కాన్​ నిర్వహించగా అతని చిన్న పేగులో చిల్లులు పడినట్లు గమనించారు. అతనికి వెంటనే చికిత్స నిర్వహించి.. ఆ భాగాన్ని తొలగించినట్లు వివరించారు.

దీనిని బట్టి.. మ్యుకర్‌మైకోసిస్‌ సాధారణంగా ముక్కు, సైనస్‌, నాడీవ్యవస్థ, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, గుండె, మూత్రపిండాలపై మాత్రమే కాకుండా పేగులు, దవడ ఎముకలపైనా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో.. ప్రస్తుతం ఈ ఇన్‌ఫెక్షన్‌ను ముక్కు, సైనస్‌ ప్రాంతాల్లో ఎక్కువగా గుర్తిస్తున్నట్లు వారు తెలిపారు. తక్కువ ఆక్సిజన్‌ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువగా ఉండి తెల్ల రక్తకణాల సంఖ్య తక్కువ ఉన్నవారిలో ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ఇంకా స్టెరాయిడ్స్​ను డాక్టర్ల సలహా మేరకే వాడాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details