సార్స్- కోవ్2లోని (SARS-CoV2) కొత్త వైరస్ రకాలు మ్యు, సీ.1.2 తరహా కేసులు ఇంతవరకు భారత్‌లో నమోదు కాలేదని.. జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం- ఇన్సాకాగ్(INSACOG) పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణికులకు.. కఠిన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆగస్టు 30న.. బీ.1.621ను (బీ.1.621.1 సహా) వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా(వీఓఐ) గుర్తించింది. దీనికే మ్యు అని నామకరణం చేసింది. మరో కొత్త రకం వైరస్ వేరియంట్.. సీ.1.2ను(C.1.2 Covid Variant) కూడా ఇటీవలే ఈ జాబితాలో చేర్చింది.
వైరస్ ఉద్ధృతి పెంచే విధంగా వైరస్ వేరియంట్లలో(Corona Variants) మార్పులు జరిగితే దానిని 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా గుర్తిస్తారు.
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ప్రమాదకరమైన సీ.1 వేరియంట్ నుంచి వచ్చిన ఉత్పరివర్తనమే సీ.1.2. కానీ.. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించలేదు. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఈ తరహా కేసుల్లేవని, అయితే జాగ్రత్తగా ఉండాలని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది.
''మ్యు గానీ, సీ.1.2. కానీ భారత్‌లో ఇప్పటివరకు వెలుగుచూడలేదు. అయితే.. అంతర్జాతీయ ప్రయాణికులకు ఆంక్షలు ఇంకా కఠినతరం చేయాల్సి ఉంది.''
- ఇన్సాకాగ్