MS Swaminathan Biography : హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు. 98 ఏళ్ల స్వామినాథన్ (MS Swaminathan Age) చెన్నైలో గురువారం ఉదయం 11 గంటలకు కన్నుమూశారు. వయసు అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. స్వామినాథన్ మృతి పట్ల దేశంలోని ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికారిక లాంఛనాలతో స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
దేశం ఓ కుమారుడిని కోల్పోయింది : వెంకయ్య నాయుడు
వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వ పరమైన విధానాల్లో కీలక మార్పులకు స్వామినాథన్ కారణమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఈ రోజు దేశం ఓ కుమారుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ను తనలానే లక్షలాది మంది ఆరాధిస్తారని చెప్పారు. చెన్నైలో స్వామినాథన్ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాను వ్యవసాయ నేపథ‌్యమున్న కుటుంబం నుంచి వచ్చినందున స్వామినాథన్‌ను ఈ రంగానికి సంబంధించి పలు సమస్యలను అడిగి తెలుసుకునేవారినని చెప్పారు. రాజ్యసభలో స్వామినాథన్ ప్రసంగాన్ని సభ్యులంతా ఎంతో ఆసక్తిగా వినేవారని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు.
"స్వామినాథన్ మరణ నన్ను బాధిస్తోంది. ఆయన కుటంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. స్వామినాథన్ ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపారు. వ్యవసాయ రంగానికి పితామహుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ద్వారా కేంద్రం పలు సంస్కరణలు తీసుకురావడానికి ఆయన బాధ్యుడు. ఆయన కారణంగా వచ్చిన సంస్కరణలు.. వ్యవసాయం రంగంలో పనిచేసే వారికి ఓ మార్గదర్శిలాంటివి"
--వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి
మోదీ సంతాపం..
అంతకుముందు.. ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. స్వామినాథన్‌తో దిగిన ఫొటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసి సంతాపం తెలిపారు. "డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మన దేశం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు.. వ్యవసాయంలో ఆయన చేసిన సంచలనాత్మక కృషి లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది. దేశానికి ఆహార భద్రతను కల్పించింది" అని ఆయన సేవలను మోదీ కొనియాడారు.
ఆ సంఘటనతో చలించి..
MS Swaminathan Passed Away : ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలు సృష్టించారు. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో చదివారు. తరువాత కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.
తండ్రి వైద్యుడు కావడం వల్ల మెడికల్ పాఠశాలలో చేరిన స్వామినాథన్.. 1943 నాటి భయంకరమైన బంగాల్ కరవును చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలిని నుంచి కాపాడాలనే లక్ష్యంతో.. వైద్య రంగం నుంచి వ్యవసాయ రంగానికి మారిపోయారు. త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో చేరి బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. 1949లో దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనాసంస్థ నుంచి సైటోజెనెటిక్స్‌లో పీజీ చేశారు.