MPs Suspended From Parliament Today :లోక్‌సభలో విపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మందిపై వేటు పడింది. ఈ మేరకు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఫరూఖ్ అబ్దుల్లా, శశిథరూర్, మనీశ్ తివారి, సుప్రియా సూలే, కార్తి చిదంబరం, ఫైజల్, సుదీప్ బందోపాధ్యాయ, డింపుల్ యాదవ్, డానిష్ అలీ ఉన్నారు. ఇప్పటికే పార్లమెంటు నుంచి 78 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 141కు పెరిగింది.
డిసెంబరు 13 నాటి ఈ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో తాజాగా పరిణామం జరిగింది. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. 'సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దనే నిబంధన ఉంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వారు (విపక్షాలు) నిరాశ చెందారు. అందుకే వారు ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు' అని దుయ్యబట్టారు.
పార్లమెంటులో అలజడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు డిమాండ్ చేసి ఉభయసభల్లో సస్పెన్షన్ గురైన ఎంపీలు వెలుపల ఆందోళన కొనసాగిస్తున్నారు. కొత్త పార్లమెంటు భవనం మకర ద్వారం వద్ద మాక్ పార్లమెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖడ్ మాదిరిగా తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయగా మిగిలిన ఎంపీలు హర్షధ్వానాలు చేశారు. రాహుల్ గాంధీ తన సెల్‌ఫోన్లో మిమిక్రీ ఘటనను వీడియో తీశారు. దీనిపై అధికారపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను, స్పీకర్‌ను అనుకరిస్తూ మిమిక్రీ చేయడంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ చర్య సిగ్గుచేటని రాజ్యసభలో వ్యాఖ్యానించారు.
రాజ్యసభ సమావేశంకాగానే ఆందోళనకు దిగిన కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌ను కూర్చోవాలని ఛైర్మన్ సూచించారు. మీ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత మరో ఎంపీ చేస్తున్న మిమిక్రీని వీడియోగ్రఫీ తీయడం సిగ్గుచేటని, ఆమోదయోగ్యంకాదనిఅన్నారు. దేనికైన ఒక పరిమితి ఉండాలన్నారు. కనీసం కొన్ని ప్రదేశాల్లో అయినా ఇలాంటి వాటిని పరిహరించాలని సూచించారు.