MPs Suspended From Lok Sabha :లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 95 మందిని సస్పెండ్ చేయగా బుధవారం మధ్యాహ్నం మరో ఇద్దరిపై వేటు పడింది. సభలో ప్లకార్డులు ప్రదర్శించిన కారణంగా థామ్స్ ఛాళిక్డన్, ఏఎమ్ ఆరిఫ్‌ను శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలని కోరామని, దీనిపై సభలో నిరసన తెలిపగానే తమను సస్పెండ్ చేశారని ఏఎమ్ అరిఫ్ తెలిపారు. ప్రస్తుతం ఉభయ సభల్లో కలిపి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల సంఖ్య 143కు చేరింది.
సభలో నిల్చుని ఎన్డీఏ సభ్యుల సంఘీభావం
మరోవైపు.. పార్లమెంట్ ప్రాంగణంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యవహరించిన తీరును ఎన్డీఏ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ధన్‌ఖడ్‌కు మద్దతుగా అధికారపక్ష ఎంపీలు బుధవారం రాజ్యసభలో కొద్దిసేపు నిల్చునే సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
"ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు (విపక్షాలు) అన్ని హద్దులను దాటుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను పదే పదే అవమానిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ప్రధాని మోదీ ఇలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానిస్తే సహించేది లేదు. మీ మీద గౌరవంతో వారు చేసిన చర్యలకు నిరసనగా ఈ ప్రశ్నోత్తరాల గంట మొత్తం నిలబడే పాల్గొంటాం."
--ప్రహ్లాద్ జోషీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
ఎన్డీఏ ఎంపీలంతా నిలబడి ఉండగా కొన్ని నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల గంట కొనసాగింది. ఆ తర్వాత స్పందించిన ఛైర్మన్ ధన్‌ఖడ్, "మీ సంఘీభావం నా మనసును తాకింది. మీరంతా కూర్చోవాలని కోరుతున్నా" అని అన్నారు. ఫలితంగా అధికారపక్ష ఎంపీలంతా వారి సీట్లలో కూర్చుని సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
జంతర్ మంతర్ వద్ద మాక్ పార్లమెంట్!
సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు గురువారం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. 140 మందికి పైగా ఎంపీలు మోక్ పార్లమెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఈ మాక్ పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి బుధవారం సాయంత్రం పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.