తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం.. ఎన్​డీఏకే విజయావకాశాలు - రాష్ట్రపతి ఎన్నికలు 2022

భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ జరగనుండగా పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ఉదయం 8గంటలకు..మాక్ పోలింగ్ జరగనుండగా ఆ తర్వాత 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దేశ ప్రథమ పౌరుడి రేసులో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముతో పాటు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ఉన్నారు. అయితే ఈసారి కూడా ఎన్‌డీఏ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికే విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

presidential election 2022
presidential election 2022

By

Published : Jul 17, 2022, 6:15 PM IST

Presidential election 2022: ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరిగే దేశ ప్రథమ పౌరుడి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4,800 మంది కాగా మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్నారు. అటు ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పా‌ట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. పోలింగ్‌ సామగ్రిని పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు తరలించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉండటం వల్ల వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా ఆకుపచ్చ, పింక్ బ్యాలెట్‌ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది. గ్రీన్‌ బ్యాలెట్‌ పేపర్‌లో ఎంపీలు., పింక్‌ పేపర్‌లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేయనున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువలను 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా నిర్ధరిస్తారు. జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది. దీని ప్రకారం.. యూపీకి చెందిన సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా.. ఝార్ఖండ్‌-తమిళనాడు రాష్ట్రాలకు అది 176గా ఉంది. అలాగే మహారాష్ట్రలో 175, సిక్కిం 7, మిజోరాం 8, నాగాలాండ్‌లో 9గా ఎమ్మెల్యే ఓటు విలువ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. ప్రస్తుతం సగటు ఎంపీ ఓటు విలువ 700గా ఉంది. దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ మొత్తంగా.. 10,86,431గా ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులుగా ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు బరిలో ఉన్నారు. ఎన్‌డీఏ తరపున ముర్ము పోటీలో ఉండగా.. ప్రతిపక్షాల తరపున యశ్వంత్‌ సిన్హా ప్రధాన పోటీదారుడిగా ఉన్నారు. అయితే.. ఎన్‌డీఏ కూటమి నిలబెట్టిన ముర్ముకే విజయవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్‌డీఐ కూటమిలోని పార్టీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు సైతం ముర్ముకే తమ మద్దతు ప్రకటించాయి. బిజద, వైఎస్సార్సీపీ, బీఎస్పీ,అన్నా డీఎంకే, తెదేపా, జేడీఎస్​, శిరోమణి అకాలీదళ్‌, శివసేన, జేెఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలు తమ ఓటు ముర్ముకేనని ఇప్పటికే ప్రకటించాయి. దీంతో మూడోవంతు ఓట్లు ఎన్​డీఏ అభ్యర్థికే దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన 10,86,431 ఓట్లలో 6.67లక్షల ఓట్లు ముర్ముకే వస్తాయని ఎన్​డీఏ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ఈ నెల 21న వెలువడనున్నాయి. ఇందులో మెజారిటీ సాధించిన వ్యక్తి భారత 15వ రాష్ట్రపతిగా ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details