మధ్యప్రదేశ్ మంద్‌సౌర్‌కు చెందిన ఓ మహిళా రైతు.. హెలికాప్టర్ కొనేందుకు రుణం మంజూరు చేయాలని కోరుతూ ఏకంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. అంతేకాదు.. ఆ హెలికాప్టర్ నడిపేందుకు లైసెన్స్ ఇప్పించాలని కూడా అందులో పేర్కొన్నారు బసంతి బాయి లోహర్.
బసంతికి శ్యామ్గఢ్ మండలం ఆగర్ గ్రామంలో కొంత సాగు భూమి ఉంది. ఇందులో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబ జీవనం సాగిస్తోంది. అయితే.. వారి పొలానికి వెళ్లే అన్ని మార్గాలను ఆ ఊరి పెద్దైన పర్మానంద్ పాటిదర్, అతని కుమారుడు లవకుశ కలిసి ఇటీవల మూసివేయించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ.. స్థానిక అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారట బసంతి. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక.. రాష్ట్రపతికి తమ గోడును విన్నవించుకున్నట్టు చెప్పుకొచ్చారా మహిళా రైతు.