మూడు నెలలు కూడా నిండని పసికందును చంపేసింది ఆ కన్న తల్లి. నీటిలో ముంచి ఓ వ్యక్తిని ఎలా చంపాలి అనే విషయాన్ని గూగుల్లో వెతికి మరీ.. ఆ చిన్నారిపై ప్రయోగించింది. ఎవరికీ సందేహం రాకుండా ఇంటిపైన ట్యాంక్లో చిన్నారిని పడేసి ప్రాణాలు బలి తీసుకుంది. ఆ తర్వాత ఏమీ తెలియని అమాయకురాలిలా నటిస్తూ.. బిడ్డ తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. విచారించగా అసలు నిజం బయటపడింది. తల్లి నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని ఖార్ఛోద్లో జరిగింది.
ఇదీ జరిగింది..
వేరు కాపురం పెట్టాలని భర్తపై బలవంతం చేసింది నిందితురాలు. ఇందుకు ఆయన ఒప్పుకోకపోవడం వల్ల దారుణానికి ఒడిగట్టింది. ఓ మనిషిని నీటిలో ముంచి ఎలా చంపాలి అని ఆన్లైన్లో వెతికింది. తర్వాత పక్కా ప్రణాళిక రచించి తన మూడు నెలల చిన్నారిని ఇంటిపైన ఉండే ట్యాంక్లో పడేసి చంపేసింది. చిన్నారి కనిపించడం లేదని ముందస్తుగానే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. ప్రతీ చోట వెతికినా.. ఆ పసికందు ఆనవాళ్లు కనిపించక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులను పోలీసులు విచారించగా.. ఆ మహిళ నిజం ఒప్పుకుంది. భర్త ఆన్లైన్ క్లాసులు చెప్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వివరించింది.
ఇదీ చూడండి:పార్లమెంట్ పాస్నే ఫోర్జరీ చేసిన ఘనుడు.. చివరకు!