woman stopped chain snatchers: బంగారం కొట్టేసేందుకు వచ్చిన ఇద్దరు దుండగుల కుట్రను భగ్నం చేశారు ఓ మహిళ. రెండేళ్ల కూతురు తన వెంటే ఉన్నప్పటికీ.. బెదిరిపోకుండా దొంగలను అడ్డుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది.
మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జదేరువా ధామ్ ప్రాంతంలో ఉన్న ఓ పార్క్ వద్ద కాజల్ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు.. చైన్ స్నాచ్కు యత్నించారు. హెల్మెట్లు ధరించి వచ్చిన దుండగులు.. కాజల్, ఆమె రెండేళ్ల కూతురు శ్రీవ్యకు తుపాకీ గురిపెట్టారు.
కూతురిని లక్ష్యంగా చేసుకుంటున్నారని గమనించిన కాజల్.. దుండగులను ప్రతిఘటించారు. అందులో ఒకరిని రాయితో బలంగా కొట్టారు. దీంతో అతడి చేతిలోని తుపాకీ కిందపడిపోయింది. అదే సమయంలో, బైక్ మీద ఉన్న రెండో వ్యక్తి పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మొదటి దొంగ కిందపడ్డ గన్ను తీసుకొనేందుకు ప్రయత్నించాడు. కాజల్ మెడలో ఉన్న గొలుసును దొంగలించాలని చూశాడు. ఈసారి ఇద్దరు దొంగలకు గట్టిగా బుద్ధి చెప్పారు కాజల్. చేతి నిండా రాళ్లు తీసుకొని దొంగలపై విసిరారు. దీంతో దుండగులు పారిపోయారు.
కూతురితో కాజల్- సచిన్ దంపతులు తన కూతురి తలకు గన్ పెట్టగానే చాలా కోపం వచ్చిందని కాజల్ చెప్పుకొచ్చారు. అదే కోపంలో వారిపై దాడి చేశానని తెలిపారు. తన భర్త సచిన్ తోమర్‌తో కలిసి మహారాజపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బీపీ సిటీలో నివాసం ఉంటున్నారు కాజల్. అదనపు ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: