ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయిన ఓ ఆటోలో నుంచి లక్ష రూపాయలతో ఉన్న టవల్‌ను ఎత్తుకెళ్లింది ఓ కోతి. దూరంగా తీసుకెళ్లి కరెన్సీ నోట్లను వెదజల్లింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ జబల్పుర్ జిల్లాలో జరిగింది.
కటాంగి గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ అనే వ్యక్తి.. సెప్టెంబర్ 30న తన టవల్లో రూ.లక్ష మూటగట్టుకుని మరో ఇద్దరితో కలిసి ఆటో ఎక్కాడు. జిల్లాలోని కటవ్ ఘాట్ ప్రాంతంలో ఉన్న ఇరుకు దారిలోకి రాగానే.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది ఆటో. వాహనాలు నిలిచిపోయేందుకు కారణం తెలుసుకోవాలని ఆటోలోంచి ముగ్గురు కిందకు దిగారు. అప్పుడే.. వెనక నుంచి వచ్చిన ఓ కోతి.. లక్ష రూపాయలు మూటకట్టిన టవల్‌ను ఎత్తుకెళ్లింది. సమీపంలోని ఓ పెద్ద చెట్టు ఎక్కి.. టవల్‌ను చింపివేయటం వల్ల.. కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ చెల్లాచెదురుగా పడ్డాయి. కోతిని చూసుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చిన బాధితుడు.. నోట్లను పోగు చేసేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయినప్పటికీ.. మొత్తం నగదును సేకరించలేకపోయాడు. రూ.56 వేలు మాత్రమే దొరికాయి. మిగిలినవి ఎవరు తీసుకున్నారో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. కోతి ఎత్తుకెళ్లి పడేసినందున ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపాడు.