మధ్యప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం బతికున్న వ్యక్తిని రెండు సార్లు మరణించేలా చేసింది. కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసేలా చేసింది. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బంధువులు.
ఇదీ జరిగింది..
విదిశాలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ వైద్యశాలలో కరోనా బాధితుడు గోరెలాల్ చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్ 13న అతడు మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మరణ వార్తతో హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న బంధువులకు అతడు చనిపోలేదని వైద్యులు చెప్పటం గందరగోళానికి గురిచేసింది.
ఏప్రిల్ 14 ఉదయం మరోసారి గోరెలాల్ చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వద్దకు వెళ్లిన బంధువులకు.. మూటకట్టిన అతడి మృతదేహాన్ని అప్పగించారు. అప్పటికే వైద్యుల తీరుతో విసుగు చెందిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టారు. బంధువుల ఒత్తిడితో మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది తెరవగా.. అది గోరేలాల్ కాదని తేలింది.
బతికున్న వ్యక్తిని రెండుసార్లు మరణించినట్లు చెప్పటంపై బాధితుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:కరోనా ఉగ్రరూపం: భారత్లో ఒక్కరోజే 2 లక్షల కేసులు