కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి హఠాన్మరణం నేపథ్యంలో భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించింది హస్తం పార్టీ. ఎంపీ మృతికి సంతాపంగా 24 గంటల పాటు యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఆదివారం జరగాల్సి ఉన్న రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. జనవరి 15కు బదులు జనవరి 17న హోశియార్పుర్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. జోడో యాత్ర ఆదివారం మధ్యాహ్నం జలంధర్‌లోని ఖాల్సా కళాశాల గ్రౌండ్ నుంచి తిరిగి ప్రారంభమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు.
శనివారం ఉదయం భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జలంధర్ ఎంపీ సంతోఖ్ చౌదరికి.. ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. రాహుల్ గాంధీతో కలిసి నడిచిన ఆయన.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను లుధియానాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎంపీ మరణవార్త తెలియగానే రాహుల్ గాంధీ యాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరారు.