MP Resign to YSRCP: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలే రాజీనామాలతో షాక్‌లిస్తున్నారు. ఎమ్మెల్యే స్థానాలు లభించలేదని కొందరు, పార్టీకి ఎంత సేవ చేసిన తమను పట్టించుకోవడం లేదని మరికొందరు, ఎంత కష్టపడిన సరైన గుర్తింపు లేదని ఇంకొందరు పార్టీని వీడుతున్నారు. ఎన్నికలు సమీపీస్తున్న వేళ తమలోని అసంతృప్తిని వైఎస్సార్సీపీ నేతలు బయటపెడ్తున్నారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ కూడా పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ నుంచి వైదొలుగుతున్నట్లు వివరించారు.
వైఎస్సార్సీపీకి మరో షాక్ - పార్టీకి మచిలీపట్నం ఎంపీ రాజీనామా
Published : Jan 13, 2024, 6:26 PM IST
|Updated : Jan 13, 2024, 10:28 PM IST
18:21 January 13
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రెండు రోజుల్లో జనసేనలో చేరే అవకాశం
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అసంతృప్తిగా ఉన్న బాలశౌరి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా అధికారికంగా ట్విటర్ ఎక్స్ ఖాతాలో బాలశౌరి వెల్లడించారు. అలాగే పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కూడా ఎక్స్ వేదికగా తెలియచేశారు.
మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో పాటు, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేశ్తోనూ ఎంపీ బాలశౌరికి రాజకీయంగా విభేధాలున్నాయి. తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని పేర్ని నానిపై బాలశౌరి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పు చేస్తుండటంతో బాలశౌరి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.
వాస్తవంగా వైఎస్ విజయమ్మను కలిసి పార్టీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించాలని బాలశౌరి భావించారు. ఆ తర్వాతే వైసీపీకు రాజీనామా చేయాలకున్నారు. అయితే నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటి దృష్ట్యా రాజీనామా విషయంలో బాలశౌరి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
వైసీపీకి రాజీనామా చేస్తేనే జనసేనలో పోటీ విషయంపై స్పష్టత ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పినట్లు సమాచారం. అందుకే ఆయన రాజీనామా నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.