తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మాజీ మంత్రి రతన్‌లాల్‌ కటారియా మృతి.. మోదీ విచారం - కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Rattan Lal Kataria MP : కేంద్ర మాజీ మంత్రి రతన్‌లాల్‌ కటారియా(72) కన్నుమూశారు. హరియాణకు చెందిన ఆయన ప్రస్తుతం లోక్​సభ సభ్యునిగా ఉన్నారు. గురువారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

mp-ratan-lal-kataria-passes-away
కేంద్ర మాజీ మంత్రి రతన్‌లాల్‌ కటారియా మృతి

By

Published : May 18, 2023, 9:30 AM IST

Updated : May 18, 2023, 11:32 AM IST

Rattan Lal Kataria MP : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లోక్​సభ ఎంపీ రతన్‌లాల్‌ కటారియా(71) కన్నుమూశారు. హరియాణాకు చెందిన ఆయన ప్రస్తుతం అంబాలా లోక్​సభ ఎంపీగా ఉన్నారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్​ రీసెర్చ్ సెంటర్​లో చికిత్స పొందుతూ కటారియా తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున దాదాపు 3.30 గంటల సమయంలో ఆయన చనిపోయినట్లు వెల్లడించారు. గురువారమే ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. మణిమజ్రాలో కటారియా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

గత కొంతకాలంగా రతన్‌లాల్‌ కటారియా న్యుమోనియాతో బాధపడుతున్నారు. రతన్‌లాల్‌ 2019 నుంచి 2021 వరకు కేంద్రమంత్రిగా పనిచేశారు. కటారియా మృతిపట్ల హరియాణా సీఎం మనోహార్ లాల్​ ఖట్టర్​ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజ శ్రేయస్సు కోసం కటారియా ఎల్లప్పుడు పార్లమెంట్​లో తన గొంతును వినిపించేవారని​ వెల్లడించారు. కాగా కటారియా మృతి నేపథ్యంలో హరియాణా రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది.

రతన్‌లాల్‌ కటారియా కేంద్ర జలశక్తి శాఖ, సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 2021 వరకు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2000 నుంచి 2003 వరకు హరియాణా బీజేపీ అధ్యక్షుడిగానూ కటారియా పనిచేశారు. 1951 డిసెంబర్​ 19న పంజాబ్​లోని యమునానగర్ జిల్లా సంధాలీ గ్రామంలో ఈయన జన్మించారు. కటారియాకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు.

ప్రధాని సంతాపం..
కటారియా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు సానుభూతి ప్రకటించారు. సమాజానికి కటారియా చేసిన సేవలను మోదీ గుర్తుకు తెచ్చుకున్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన పాటుపడ్డారని ప్రధాని వెల్లడించారు. హరియాణాలో బీజేపీ బలోపేతం సాధించడంలో కటారియా కీలక పాత్ర పోషించారని మోదీ వ్యాఖ్యానించారు. మరికొంత మంది ప్రముఖ నేతలు సైతం కటారియా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

కటారియా.. 50 సంవత్సరాల పాటు ఆర్​ఎస్​ఎస్​ హరిజన్ కళ్యాణ్ నిగమ్ అధ్యక్షుడుగా పనిచేశారు. గురు రవిదాస్ సభ అధ్యక్షుడిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. హరియాణాలో ప్రముఖ దళిత నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. 1999లో 13వ లోక్​సభకు ఆయన ఎన్నికయ్యారు. 2014, 2019 లోక్​సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1985లో రాడౌర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చైల్డ్​ ఆర్టిస్ట్​గానూ కటారియా పలువురు నుంచి ప్రశంసలు అందుకున్నారు. భారత మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నుంచి అవార్డ్​ సైతం కటారియా అందుకున్నారు.

Last Updated : May 18, 2023, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details