తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఐడీ అధికారులు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. రామోజీరావు వైపే న్యాయం: ఎంపీ రఘురామ - raids on margadarsi

MP RRR ON MARGADARSI AND RAMOJI RAO: తెలుగు ప్రజల ఆస్తి రామోజీరావు అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రామోజీరావు సంపాదించిన ప్రతి రూపాయి ఆంధ్ర, తెలంగాణలోనే ఖర్చు పెట్టారని.. ప్రచారాన్ని ఆశించకుండా రామోజీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. మార్గదర్శిపై ఏపీ సీఐడీ పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసిన.. రామోజీరావు వైపే న్యాయం ఉందని చెప్పారు.

MP RRR ON MARGADARSI AND RAMOJI RAO
MP RRR ON MARGADARSI AND RAMOJI RAO

By

Published : Apr 10, 2023, 8:07 PM IST

MP RRR ON MARGADARSI AND RAMOJI RAO: ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు, ఫిలిం సిటీ సృష్టికర్త రామోజీరావు అనే వ్యక్తి కేవలం తన కుటుంబ సభ్యుల ఆస్తి మాత్రమే కాదని.. ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణ రాజు అభిప్రాయపడ్డారు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు మాదిరిగా.. ఫిలిం సిటీ నిర్మాణాన్ని రామోజీరావు చేశారని కొనియాడారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి చెప్పినట్లుగా బ్రతికితే ఒక్క రోజైనా రామోజీరావులా బతకాలని.. గొప్పగా, నలుగురికి నిజమైన మార్గదర్శిలా జీవించాలని పేర్కొన్నారు.

ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎంపీ రఘురామకృష్ణ తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మార్గదర్శిపై ఏపీ సీఐడీ పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసిన.. రామోజీరావు వైపే న్యాయం ఉందని చెప్పారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, ఈ విషయం తేలిపోతుందన్నారు. సీఐడీ పోలీసులు జారీ చేసిన నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. రాక్షసులతో డీల్ చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని.. మారీచుని మించిన వాళ్లు అవతలి వ్యక్తులని గ్రహించాలన్నారు. గతంలో తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, హైదరాబాద్ పోలీసుల సహకారంతో అకారణంగా అరెస్ట్ చేసి, లాకప్​లో చిత్రహింసలకు గురి చేశారన్నారు.

తనకొచ్చిన లాభాలను ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన మార్గదర్శి..మార్గదర్శి సంస్థను 1962లో రామోజీరావు స్థాపించారని.. దినదినాభివృద్ధి చెందుతూ, గత 60 ఏళ్లలో 108 శాఖలకు విస్తరించి మూడు వేల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది ఖాతాదారులతో, ఏడు వేల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగి సజావుగా సాగుతున్న సంస్థ మార్గదర్శి అని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ మనస్తత్వంతో, కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పుడుతున్నారని విమర్శించారు.

మార్గదర్శిపై ఇప్పటివరకూ ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు:మూడు లక్షల మంది చందాదారుల్లో ఏ ఒక్కరూ కూడా మార్గదర్శి సంస్థలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. మార్గదర్శి ఫైనాన్షియల్ పేరిట గతంలో డిపాజిట్లను సేకరించిన మాట నిజమేనన్న రఘురామ.. అయితే, అప్పట్లో డిపాజిట్లను సేకరించడానికి చట్ట ప్రకారం వెసులుబాటు ఉండేదన్నారు. డిపాజిట్ల సేకరణ కోసం మార్గదర్శి సంస్థ ప్రచారం చేసుకోలేదని.. పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. అయినా ఆ సంస్థ పై నమ్మకం ఉన్నవారు, తమ సొమ్మును డిపాజిట్ చేశారన్నారు.

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మాత్రమే డిపాజిట్లను సేకరించాలని గతంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన చిదంబరం హయాంలో చట్ట సవరణ చేసిన తర్వాత, మార్గదర్శి సంస్థ తాను సేకరించిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చిందని తెలిపారు. డిపాజిట్లను వెనక్కి చెల్లింపులో మార్గదర్శి సంస్థ ఎక్కడ కూడా డిఫాల్టర్ కాలేదన్నారు. ఎన్నో బ్యాంకులు ఖాతాదారుల నెత్తిన టోపిని పెట్టి మూసి వేశాయని.. మరి ఈ ప్రభుత్వం, అటువంటి బ్యాంకులపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఏనాడైనా జగన్​ నేరాల గురించి సాక్షిలో ప్రచురితమైందా: ఆర్థిక నేరాల కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి గురించి ఈనాడు దినపత్రికలో రాయడం వల్లే, రామోజీరావుపై ఎలాగైనా ఆయనపై ఆరోపణలను నిజం చేయాలన్న కక్షతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. రామోజీరావు విలువలకు కట్టుబడిన వ్యక్తి అని.. ఆయనను సీఐడీ పోలీసులు విచారించిన విషయాన్ని కూడా ఈనాడు దినపత్రికలో వార్తగా ప్రచురింపజేశారని గుర్తు చేశారు. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి తన కేసుల గురించి సాక్షి దినపత్రికలో రాయించారా? అని నిలదీశారు. రామోజీరావును సీఐడీ పోలీసులు విచారిస్తున్నప్పుడు, ఆయన ఫొటో బయటికి ఎలా వచ్చిందన్న దానికి ఇప్పటివరకు సమాధానం లేదన్నారు. అదే కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ గురించి బయటకు వస్తే, ఎలా వచ్చిందని మాత్రం ప్రశ్నిస్తారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకువచ్చిన వ్యక్తిని ఇంతలా అవమానించడం దారుణమన్నారు. సాక్షి దినపత్రికను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత, ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఉషోదయ పబ్లికేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కుట్ర చేసి, రామోజీరావును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

72 గంటల్లో మాజీ మంత్రి వివేకా కేసులో అరెస్ట్​ జరిగే అవకాశం..!: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో రానున్న 72 గంటల వ్యవధిలో అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదని జోస్యం చెప్పారు. ఏప్రిల్ నెల ఆఖరు నాటికి కేసు విచారణను పూర్తి చేస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టుకు సీబీఐ విన్నవించిందని తెలిపిన రఘురామ.. ఈ హత్య సూత్రధారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని హైకోర్టుకు సీబీఐ ఇప్పటికే స్పష్టంగా చెప్పడమే కాకుండా వారిని అరెస్టు చేస్తామని కూడా పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కేసు విచారణ ఒక స్థాయి వరకు కచ్చితంగా జరగవచ్చని.. ఆ పై స్థాయి వ్యక్తుల ప్రమేయం గురించి విచారణ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details