Pilli subhash: 'ఏపీలో మంత్రి Vs ఎంపీ'.. వేణుకు టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్న పిల్లి సుభాష్ - pilli Subhash
14:46 July 23
వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయమై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు
Pilli subhash angry with Minister Venu: వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుకి రామచంద్రాపురం టికెట్ ఇస్తే... తాను లేదా తన కుమారుడు స్వతంత్ర అభ్యర్థిగా అతడిపై పోటీ చేస్తామని... వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చిచెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కేడర్‌ను... మంత్రి వేణు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వేణుతో కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారన్న బోస్... ఆ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లో తనకు ఆమోదయోగ్యం కాదని, క్యారెక్టర్ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పానని వెల్లడించారు. కార్యకర్తలు, క్యాడర్ వద్ద వేణు ఎన్ని రోజులు నటిస్తారు? అని చంద్రబోస్ ప్రశ్నించారు.
- Deputy CM Kottu comments: జగన్ మళ్లీ అధికారంలోకొస్తే.. అందరి లెక్కలు తేలుస్తాం: డిప్యూటీ సీఎం కొట్టు
30 ఏళ్లుగా తనతోనే ఉన్న క్యాడర్ నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారని, మంత్రి వేణు వారిపై కేసులు పెట్టిస్తున్నారని సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దళితుడనే ఆయనపై చేయి చేసుకున్నారని, మంత్రి సమక్షంలో కొట్టడం సబబేనా, ఇలాంటి పనులు మౌనంగా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
అధిష్టానం వద్దకెళితే వారు గుమ్మం తలుపు కూడా తీయరన్న సుభాష్.. రామచంద్రపురంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి తనను, సీనియర్ నేత తోట త్రిమూర్తులుని పిలవొద్దని మంత్రి చెప్పిన నాడే మంత్రి వేణు వైసీపీ అభ్యర్థి అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు వ్యవహార శైలిపై బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా..? కార్యకర్తలు, క్యాడర్ వద్ద వేణు ఎన్ని రోజులు నటిస్తారు? అని మండిపడ్డారు.