భారతదేశంలోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో మరో అరుదైన వజ్రం బయటపడింది. నవమి రోజున దొరికిన ఈ అరుదైన వజ్రం నొయిడాకు చెందిన రాణా ప్రతాప్‌ను రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. పన్నా గనుల్లో మరో అరుదైన వజ్రం తమ గనిలో దొరికిందని గని యజమాని సంబరాలు చేసుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో నివాసముంటున్న రాణా ప్రతాప్ తన భార్య పేరుతో మధ్యప్రదేశ్‌లోని సిరస్వాహాలోని భర్కా గని ప్రాంతంలో ఓ మైన్ లీజుకు తీసుకున్నారు. ఆరు నెలలుగా తవ్వకాలు జరుపుతుండగా.. నవమి రోజున(మంగళవారం) అతనికి 9.64 క్యారెట్ల నాణ్యమైన వజ్రం ఒకటి దొరికింది. అంతటి విలువైన వజ్రం తమకు దొరికినందుకు రాణా ప్రతాప్ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్‌లో డిపాజిట్ చేసినట్లు తెలిపాడు రాణా ప్రతాప్.