Madhyapradesh Panchayat Elections: మధ్యప్రదేశ్‌లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారు ప్రమాణస్వీకారం చేశారు. అయితే సాగర్, దమోహ్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో గెలిచిన మహిళల స్థానంలో వారి కుటుంబంలోని మగ బంధువులు ప్రమాణం చేయడం స్థానికంగా వివాదాస్పదంగా మారింది. జైసినగర్ గ్రామంలో 10 మంది మహిళలు పంచాయతీ సభ్యులుగా ఎన్నికవ్వగా.. ఓ మహిళ స్థానంలో ఆమె తండ్రి ప్రమాణం చేశారు. మరో ఇద్దరు మహిళల భర్తలు, మరో మహిళ బావ ప్రమాణస్వీకారం చేశారు. దామోహ్ జిల్లాలోని గైసాబాద్, పిపారియా కిరౌ గ్రామాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.
ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడం వల్ల ఈ వ్యవహారం బయటికొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవడం వల్ల సాగర్ జిల్లా పంజాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు. జైసినగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆశారాం సాహూను విధుల నుంచి సస్పెండ్ చేశారు. "పంచాయతీ సభ్యులుగా గెలిచిన మహిళలను ప్రమాణస్వీకారానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా వారు రాలేదు. వారికి బదులుగా తమ బంధువులను పంపించారు. దీంతో చేసేదేం లేక, వారితోనే ప్రమాణం చేయించాం" అని సాహూ చెప్పడం గమనార్హం.