మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రవి రాణా.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటులో సచిన్ వాజే అంశంపై మాట్లాడిన సందర్భంలో.. శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ తనను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఆమె పోలీస్ స్టేషన్లోనూ ఆశ్రయించారు.
వాజే అంశం లేవనెత్తగానే.. 'నువ్ మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా, జైల్లో పెట్టిస్తా.' అని సావంత్ బెదిరించినట్లు రాణా తెలిపారు.
గతంలోనూ శివసేన నుంచి తనకు యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపులు వచ్చాయని రాణా పేర్కొన్నారు.
''ఎంపీ అర్వింద్ సావంత్ నన్ను బెదిరించిన తీరు నా ఒక్క దానికే కాదు.. దేశంలోని మహిళందరికీ అవమానకరమే. అందుకే.. సావంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.''
- నవనీత్ రవి రాణా, స్వతంత్ర ఎంపీ
ముంబయి మాజీ సీపీ పరమ్‌బీర్ సింగ్ ఆరోపణల నేపథ్యంలో.. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహా మహారాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో సోమవారం నవనీత్ రాణా.. సచిన్ వాజే అంశాన్ని లేవనెత్తారు.