MP MVV Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఇటీవల(జూన్ 13) రౌడీ షీటర్ హేమంత్ మరో ఐదుగురితో కలిసి ఏకంగా ఎంపీ ఇంటినే ఆధీనంలోకి తీసుకుని ఆయన కుమారుడు శరత్, భార్య జ్యోతి, వైసీపీ నేత, ప్రముఖ ఆడిటర్ జీవీలను కిడ్నాప్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన తర్వాత ఎంపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖను వదిలి ఆయన తెలంగాణకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖను వైసీపీ ఎంపీ వదిలి వెళ్లిపోతాననడం రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
గతంలోనూ ఇలాగే: గత సంవత్సరం మధురవాడలోని సాయి ప్రియ గార్డెన్స్ వద్ద ఎంవీవీ, ఆడిటర్ జీవీ చేపట్టిన భారీ ప్రాజెక్టు విషయంలో వివాదం తలెత్తింది. గెడ్డను మళ్లించారని, తన స్థలం నుంచి రహదారి వేశారంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలోని నాన్ కేడర్ ఎస్పీ ఒకరు ఆరోపించారు. ఆ సమయంలో 'ఇక్కడ వ్యాపారం చేయనివ్వడం లేదు. నేను హైదరాబాద్ వెళ్లిపోతా' అని ఎంపీ పేర్కొన్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయ సాయిరెడ్డి ఉన్న సమయంలోనూ పలు విషయాల్లో పరస్పర ఆరోపణలు సాగాయి. అప్పట్లోనూ వైజాగ్లో వ్యాపారాలు సాగనివ్వడం లేదనే భావన ఆయన వ్యక్తం చేశారు. కుటుంబీకుల కిడ్నాప్ ఉదంతం తర్వాత మరోసారి అదే చెబుతున్నారు. విశాఖలో వ్యాపార రీత్యా అవసరమైన అనుమతులు సైతం పొందడంలో జాప్యమవుతుందన్న ఆవేదన ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.