రాజ్యసభ కార్యకలాపాల్ని సెల్ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ సభ్యురాలు రజనీ అశోక్‌రావ్ పాటిల్‌పై ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ జగధీప్ ధన్‌ఖడ్ శుక్రవారం ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల ప్రస్తుత సెషన్ ముగిసేవరకు ఆమె సభకు రాకూడదని స్పష్టం చేశారు.
గురువారం రాజ్యసభకు సంబంధించిన ఓ వీడియో ట్విట్టర్లో చక్కర్లు కొట్టిన విషయాన్ని సభాపక్ష నేత పీయూష్ గోయల్ శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రస్తావించారు. సభ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌ను కోరారు.
"ప్రతిపక్ష నాయకులు స్పష్టంగా కనిపించకపోయినా.. ఇలా పార్లమెంట్లో అనధికారికంగా వీడియో తీయడం మంచిది కాదు. దీనిపై ఇప్పటికే పలువురు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కోరుతున్నాను. ఇలా చేయడాన్ని సభా ఉల్లంఘనగా భావిస్తున్నాను. వీడియో తీసిన సభ్యులు ఎవరైనా సరే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను."
--పీయూష్ గోయల్, సభాపక్ష నేత
కాంగ్రెస్ ఎంపీని సస్పెండ్ చేయాలంటూ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రతిపాదించగా.. విచారణ పూర్తైన తర్వాతే చర్య తీసుకోవాలని కోరింది కాంగ్రెస్. ఎంపీని సస్పెండ్ చేయాలంటూ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సహా పలువురు భాజపా ఎంపీలు డిమాండ్ చేశారు. వీరి అభ్యర్థనపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్.. సస్పెన్షన్‌పై ప్రకటన చేశారు."సభా కార్యకలాపాలకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా పరిగణించాను. అవసరమైన చర్యలన్నీ చేపట్టాను. సభ పవిత్రతను కాపాడేందుకు.. బయటి సంస్థల సాయాన్ని ఈ విషయంలో కోరలేం. అందుకే ఈ ఉదయం సభలోని సీనియర్ సభ్యులతో మాట్లాడాను. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే విషయంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఈ మొత్తం వ్యవహారంపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేస్తుంది. ఏం చర్యలు తీసుకోవాలో ఆ కమిటీ చేసే సిఫార్సులను ఈ సభ ఆమోదించేవరకు.. రజనీ అశోక్‌రావ్ పాటిల్‌ను సస్పెండ్ చేస్తున్నాం. బడ్జెట్ సమావేశాల ప్రస్తుత సెషన్‌కు ఈ సస్పెన్షన్ వర్తిస్తుంది" అని స్పష్టం చేశారు రాజ్యసభ ఛైర్మన్.
'మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకే సస్పెండ్'
బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెన్షన్‌కు గురికావడంపై ఎంపీ రజనీ అశోక్‌రావ్ పాటిల్ స్పందించారు. "నేను ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కుటుంబం నుంచి వచ్చాను. చట్టాలను అతిక్రమించే సంస్కృతి నాకు లేదు. మేము ప్రధాని మోదీ ప్రసంగాన్ని పదేపదే అడ్డుకున్నాం. అందుకే వారు విసిగిపోయి ఈ పని చేశారు. ఇదంతా ప్రణాళిక ప్రకారం జరిగింది." అని ఆమె చెప్పారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. తొలి సెషన్ ఫిబ్రవరి 13 వరకు సాగనుంది. తిరిగి మార్చి 13న మొదలై ఏప్రిల్ 6న పూర్తి కానుంది.
ఇవీ చదవండి;అదానీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
బరువు పెరగాలని అండర్వేర్లో రాళ్లు.. ఫిట్నెస్ టెస్ట్ పాస్ కోసం అడ్డదారులు