ఈ రోజుల్లోనూ మూఢనమ్మకాలతో ప్రజలు అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోనూ ఇలాంటి ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. కరెంట్ షాక్తో చనిపోయిన ఓ కార్మికుడి మృతదేహాన్ని గంటలకొద్దీ బురదనేలలోనే ఉంచారు గ్రామస్థులు. బాడీని తడి నేలలో ఉంచితే.. శరీరం నుంచి విద్యుత్తు బయటకుపోయి బతికొస్తాడని ఆ గిరిజన తెగకు చెందిన ప్రజలు విశ్వసించడమే కారణం.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయినా.. వారికి మృతదేహాన్ని అప్పగించేందుకు స్థానికులు ఒప్పుకోలేదు. కొద్దిసేపు వాగ్వాదం కొనసాగింది. చివరకు ఎలాగోలా వారిని ఒప్పించి, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
మృతుడు సల్మాన్.. భవన నిర్మాణ పనుల్లో భాగంగా ఇంటి పైకప్పు వేస్తుండగా హైటెన్షన్ కేబుల్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.