వివాహేతర సంబంధం ఉన్న కారణంతో ఓ ఆదివాసీ మహిళపై అమానవీయంగా దాడి చేశారు గ్రామస్థులు. భర్తను మహిళ భుజాలపై ఊరేగించిన జనం.. అనంతరం ఆమెకు, ప్రియుడికి చెప్పులదండ వేసి చితకబాదారు. ఈ క్రమంలో బాధితురాలిని వివస్త్రను చేశారు స్థానికులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా బోర్పాడవ్ గ్రామంలో ఆదివారం జరిగింది.
ఇదీ జరిగింది: బాధితురాలు అదే గ్రామానికి చెందిన హరీ సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే గత నెల 24న ఆమె ఇంటి నుంచి పరారై గుట్టుగా ప్రియుడి ఇంట్లో నివసిస్తోంది. భార్య కనిపించకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త మంగీలాల్.. గ్రామంలో కూడా ఆమె కోసం వెతికాడు. అనుమానం వచ్చి హరీ సింగ్ ఇంటికి వచ్చిన మంగీలాల్.. ఓ గదిలో తలదాచుకుంటున్న భార్యను చూశాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిని చితకబాదారు. బాధితురాలిని వివస్త్రను చేసిన దాడి చేశారు. హరీ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. బాధితులపై దాడి చేసిన 11 మందిపై కేసు నమోదు చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.
చెల్లిపై అత్యాచారం:చెల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్ననే పశువులా ప్రవర్తించాడు. ఓ 13 ఏళ్ల బాలికపై సొంత అన్ననే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం కేరళలోని పాలక్కడ్‌లో జరిగింది. బాలిక గతనెల బిడ్డకు జన్మనివ్వడం వల్ల అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఈ దారుణానికి ఒడిగట్టింది సోదరుడే అని తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భయంతోనే బాధితురాలు ఇన్నాళ్లు విషయాన్ని దాచిందని పోలీసులు తెలిపారు.