రైల్లో ప్రయాణిస్తున్న 32 ఏళ్ల ప్రయాణికురాలిని లైంగిక వేధింపులకు గురి ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులపై పోలీసులు శుక్రవారం కేసు నమోదుచేశారు. మరోవైపు, ఈ ఆరోపణలను ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు.
"రేవా నుంచి భోపాల్ వెళుతున్న రేవాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో హెచ్-1 బోగీలో నేను నా కుమారుడితో కలిసి ప్రయాణిస్తున్నాను. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న కోట్మా శాసనసభ్యుడు సునీల్ సరాఫ్, సత్నా శాసనసభ్యుడు సిద్ధార్థ్ కుశ్వాహా నా చేయి పట్టుకుని తమతో డిన్నర్ చేయాల్సిందిగా కోరారు" అని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్నీ-దమోహ్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
రైలు సాగర్ రైల్వేస్టేషన్ వచ్చాక పోలీసులు బోగీలోకి వెళ్లి ఎమ్మెల్యేలను విచారించారు. "శాసనసభ్యులపై ఐపీసీ-354 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం" అని సాగర్ రైల్వే పోలీసుస్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ అహిర్వార్ తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ మాట్లాడుతూ.. "మాపై ఆరోపణలు చేసిన మహిళ తన కుమారుడిపై ప్రమాణం చేసి.. మేం అత్యాచారం చేశామని చెబితే మేం ఎలాంటి శిక్షకైనా సిద్ధం" అని పేర్కొన్నారు.