వైద్య రంగంపై ఏటా వేల కోట్లు ఖర్చు చేసినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడలేదనేందుకు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా మారింది. ఛతర్‌పుర్ జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ రోగికి టార్చ్‌లైట్ వెలుతురులో చికిత్స నిర్వహించాల్సి వచ్చింది. నౌగావ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
టార్చ్లైట్లోనే రోగిని పరామర్శిస్తున్న డాక్టర్ ఏమైందంటే..
అలిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే శివ్ శంకర్(45), పార్వతి(40)లు.. పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని గ్రామస్థులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శివ శంకర్ చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు. విషమంగా ఉన్న మహిళ పరిస్థితిని చూసి వెంటనే చికిత్స ప్రారంభించారు.
ఈ సమయంలో ఆస్పత్రిలో కరెంట్ లేదు. కనీసం జనరేటర్ కూడా అందుబాటులో లేదు. అయితే, రోగి తీవ్రత దృష్ట్యా వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించాలని అనుకున్నారు. డాక్టర్లు, నర్సులు తమ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి.. మహిళకు చికిత్స చేశారు. వైద్యుల అప్రమత్తతతో మహిళ పరిస్థితి ఇప్పుడు కుదుటపడింది.
జనరేటర్లు పేపర్‌కే పరిమితం
అయితే, ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనరేటర్ కూడా అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని ఆస్పత్రులకూ జనరేటర్లు అందుబాటులో ఉన్నాయని అధికార యంత్రాంగాలు గొప్పలు చెప్పుకుంటున్నా.. అవన్నీ పేపర్‌కే పరిమితం అయ్యాయని ఇలాంటి ఘటనల ద్వారా స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి:పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత