మతస్వేచ్ఛ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు అమలులోకి వస్తే మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతమార్పిడులకు పాల్పడేవారికి 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. అంతేగాక రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం లభిస్తుంది.
ఈ బిల్లు అమలులోకి వస్తే దేశంలో మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందిన పటిష్ఠ చట్టంగా నిలుస్తుందని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. 1968 మత స్వేచ్ఛ చట్టం స్థానంలో ఇది అమలులోకి వస్తుందని చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఈ చట్టం ప్రకారం మోసపూరితంగా జరిగిన వివాహాన్ని చెల్లనిదిగా పరిగణనలోకి వస్తుందని చెప్పారు మిశ్రా. మతాన్ని మార్చుకోవాలని అనుకునేవారు జిల్లా ప్రభుత్వ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకొనేలా ఓ నిబంధన జోడించినట్లు వివరించారు.
యూపీ ఆర్డినెన్సుకు నెలరోజులు
మరోవైపు, ఉత్తర్ప్రదేశ్ తీసుకొచ్చిన ఇదే తరహా 'లవ్ జిహాద్' ఆర్డినెన్సుకు నెల రోజులు నిండాయి. నవంబర్ 27న అమలులోకి వచ్చిన ఆర్డినెన్సు ఆధారంగా... 12 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బలవంతంగా మత మార్పిడులకు సంబంధించి 35 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఆర్డినెన్సు అమలులోకి వచ్చిన తర్వాతి రోజే బరేలీలో ఓ కేసు వెలుగులోకి వచ్చింది.