తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్ పిటిషన్‌ - వివేకాహత్యకేసు

Viveka Murder case: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో అవినాష్‌రెడ్డి కోరారు. 160 సీఆర్​పీసీ నోటీస్‌ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 9, 2023, 4:33 PM IST

Updated : Mar 9, 2023, 7:04 PM IST

MP Avinash Reddy Petition: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది సీబీఐ. ఈ వివేకా హత్య కేసులో నిజనిజాలే లక్ష్యంగా సీబీఐ వ్యవహరిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ శుక్రవారం (రేపు) ఉదయం 11 గంటలకు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు విచారించే సమయంలో ఆడియో, వీడియో చిత్రీకరణ జరిపేలా ఆదేశించాలని పిటిషన్‌లో ఆయన కోరారు. తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని, సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం ప్రతిని ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోరారు. 160 సీఆర్​పీసీ నోటీస్‌ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో అవినాష్‌ రెడ్డి కోరారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేయలేదు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించ లేదు. దస్తగిరి అక్కడ.. ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందని, నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్‌ రెడ్డి అన్నారు. వివేకా హత్యకేసులో దర్యాప్తు అధికారి పని తీరు పక్షపాతంగా ఉందని, వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని.. అదే కోణంలో విచారణ చేస్తున్నారని, తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని అవినాష్‌ రెడ్డి పిటిషన్‌లో వెల్లడించారు.

వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డిని మొదటి నుంచి అనుమానిస్తున్న సీబీఐ.. జనవరి నెల 28 న మొదటి సారి విచారించింది. అప్పట్లో పలు కీలక అంశాలను సేకరించినట్లు సమాచారం. ఫిబ్రవరి 24న రెండవ సారి ప్రశ్నించింది. అప్పటివరకూ తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సిద్ధం చేసిన ప్రశ్నలను ఆయనపై సంధించింది సీబీఐ.

మరోవైపు అవినాష్ రెడ్డి​ తండ్రి వైఎస్​ భాస్కర్​ రెడ్డికి సైతం సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. కానీ ఈసారి తన తండ్రి విచారణకు హాజరవుతారని అవినాష్​ రెడ్డి తెలిపారు. భాస్కర్​రెడ్డి ఈ నెల 12న విచారణకు హాజరు కానున్నారు.

Last Updated : Mar 9, 2023, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details