MP AVINASH ANTICIPATORY BAIL PETITION: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని అవినాష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆయన హైకోర్టును కోరారు. ఎంపీ అవినాష్ అభ్యర్థనపై మధ్యాహ్నం 2.30గంటలకు హైకోర్టు విచారణ జరపనుంది.
ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పలు కీలక అంశాలు: అయితే ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో సీబీఐ నాలుగు సార్లు విచారించి వాంగ్మూలం నమోదు చేసిందని ఆయన తెలిపారు. నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని గతంలో హైకోర్టులో సీబీఐ చెప్పిందని.. ఇప్పుడు అరెస్టు చేసే ఉద్దేశంతో ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు. దస్తగిరి వాంగ్మూలం మేరకు ఇరికించాలని సీబీఐ చూస్తోందని ఆరోపణలు చేశారు. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను సీబీఐ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ కచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం కాదని.. వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదని అవినాష్ అన్నారు.