తెలంగాణ

telangana

ETV Bharat / bharat

YS Viveka Murder case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​ రెడ్డి అరెస్టు, బెయిల్‌పై విడుదల

MP Avinash Arrested
ఎంపీ అవినాష్​ రెడ్డి అరెస్టు

By

Published : Jun 8, 2023, 9:24 PM IST

Updated : Jun 9, 2023, 6:52 AM IST

21:21 June 08

అవినాష్​ రెడ్డికి మే 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​ రెడ్డి అరెస్టు, బెయిల్‌పై విడుదల

Kadapa MP Avinash Reddy Arrested: వివేకా హత్య కేసులో ఈ నెల 3 వ తేదీన జరిగిన మరో కీలక పరిణామం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో వైఎస్​ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చిన సీబీఐ.. విచారణకు హాజరైన సమయంలో అరెస్టు చేసింది. వెంటనే పూచీకత్తుపై విడుదల చేసింది. ముందస్తు బెయిల్‌ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ.. అరెస్టు చేసి వెంటనే విడుదల చేసింది. ఐతే ఇన్ని రోజులపాటు సీబీఐ, అవినాష్​ రెడ్డి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం.

గత వారంలోనే అరెస్టు, విడుదల: వైెఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేర్చిన సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసింది. ఐదు లక్షల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని.. అరెస్టు వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరైన సమయంలోనే అరెస్ట్, విడుదల రెండు జరిగిపోయాయి. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి.

విచారణకు దూరంగా అవినాష్​ : మొదట విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్​ భాస్కరరెడ్డి అరెస్ట్‌ తర్వాత తనను కూడా అరెస్ట్‌ చేస్తారనే ఆందోళనతో ఏదో ఒక సాకు చెబుతూ సీబీఐ విచారణకు అవినాష్​ రెడ్డి గైర్హాజరవుతూ వచ్చారు. అందులో భాగంగానే గత నెల 16 నుంచి విచారణకు హాజరుకాకుండా.. కర్నూలు ఆసుపత్రిలో తల్లి ఉన్నందున రాలేనని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో సీబీఐ బృందం కర్నూలుకు వెళ్లి అవినాష్​ రెడ్డిని అరెస్టుచేయటానికి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆసుపత్రి ముందు అవినాష్‌ రెడ్డి అనుచరులు పెద్దఎత్తున మోహరించడంతో జిల్లా ఎస్పీని సీబీఐ సాయం కోరింది. శాంతి భద్రతల కారణం చూపుతూ పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సీబీఐ వెనుదిరగాల్సి వచ్చింది.

అవినాష్​కు ముందస్తు బెయిల్​ : తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో.. ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారించేలా ఆదేశించాలంటూ అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు.. గత నెల 31న తీర్పు వెలువరించింది. అవినాష్‌ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఒకవేళ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న అవినాష్‌రెడ్డి సీబీఐ కార్యాలయానికి విచారణకు వచ్చినప్పుడు.. సాంకేతికంగా అరెస్ట్‌ చేసి, పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. ఐతే అరెస్ట్, విడుదల విషయాన్ని సీబీఐ గానీ, అవినాష్‌రెడ్డి గానీ వెల్లడించకుండా గోప్యత పాటించారు.

దస్తగిరి అంశంలోనూ ఈ విధంగానే : వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి విషయంలోనూ సీబీఐ అధికారులు ఇదే విధానాన్ని అనుసరించారు.న్యాయస్థానం 2021 అక్టోబరు 22న షరతులతో దస్తగిరికి ముందస్తు బెయిల్‌మంజూరు చేసింది. ఈ క్రమంలో అక్టోబరు 23న సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేసి, 20 వేల పూచీకత్తుపై వెంటనే విడుదల చేశారు.

Last Updated : Jun 9, 2023, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details