Movies Influence Children's Behavior: 'పుష్ప', 'భౌకాల్' వంటి సినిమాలు, వెబ్ సిరీస్ చూసి మాక్కూడా అలా చేయాలనిపించింది. వాటిలో చూపిన గ్యాంగ్‌స్టర్ల జీవనశైలి మమ్మల్ని ఆకట్టుకొంది.. చిరుప్రాయంలో హంతకులుగా మారిన ముగ్గురు చిన్నారులు ఇలా చెప్పుకొంటూపోతుంటే నోళ్లు వెళ్లబెట్టడం దిల్లీ పోలీసుల వంతైంది. దేశ రాజధాని నగరంలోని జహంగిర్‌పురి ప్రాంతంలో ఈ ముగ్గురూ కలిసి ఓ అమాయకుణ్ని హత్య చేశారు. చేసిన హత్యను ఆద్యంతం వీడియో తీశారు. దీన్ని ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేయాలన్నది వారి ఆలోచన. కేవలం నేర ప్రపంచంలో పేరు తెచ్చుకోవాలనే కోర్కెతోనే వీరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ముగ్గురినీ అరెస్టు చేశారు.
కత్తిపోట్లకు గురైన ఓ వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నట్లు బుధవారం బాబూ జగ్జీవన్‌రామ్ మెమోరియల్ ఆసుపత్రి నుంచి ఫోను రాగానే పోలీసులు పరుగులు తీశారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించారు. పోలీసు విచారణలో అతడు జహంగిర్‌పురి ప్రాంతానికి చెందిన శిబు (24) అని తేలింది. సీసీ టీవీ ఫుటేజి పరిశీలించగా.. విషయమంతా బయటపడినట్లు వాయవ్య దిల్లీ డీసీపీ ఉషా రంగ్నాని తెలిపారు. సినిమాల్లోని గ్యాంగ్‌స్టర్లను చూసి స్ఫూర్తి పొందిన ముగ్గురు కుర్రాళ్లు 'బద్నాం గ్యాంగ్' పేరిట ఓ ముఠా ఏర్పాటు చేశారు. ఈ ముఠాకు పేరు రావాలంటే ముందు ఓ వ్యక్తిని చంపాలని పథకం వేసుకొన్నారు. జహంగిర్‌పురి 'కె' బ్లాకులోకి వెళ్లి ఒంటరిగా దొరికిన శిబుతో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు అతనిపై దాడి చేస్తుండగా, మూడో కుర్రాడు సెల్‌ఫోనుతో ఆ దృశ్యాలు చిత్రీకరించాడు. శిబును కర్రతో కొట్టి, చివరకు బాకుతో పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేరం బయటపడి పోలీసుల అదుపులో ఉన్న బాల నేరస్థుల నుంచి హత్యను చిత్రీకరించిన సెల్‌ఫోను, బాకును స్వాధీనం చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.