Motkupalli on Chandrababu Arrest: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని చంపేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. బాబు అడ్డు తొలిగితే తమ అధికారానికి.. ఎవరూ ఎదురు ఉండదని కొందరు భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓ నియంత అని విమర్శించారు. అప్పట్లో ఆయనకు మద్దతు ఇచ్చినందుకు తలదించుకుంటున్నానని అన్నారు.
Motkupalli Narasimhulu Comments on CM Jagan : సొంత బాబాయ్‌ని హత్య చేసిన వారిని పట్టుకోలేని జగన్.. ప్రజలను ఎలా పరిపాలిస్తారని ప్రశ్నించారు. పెళ్లి రోజే అరెస్ట్ చేయడం ఏం ఆనందం ఇచ్చిందో అర్థం కాలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు కనీసం నాలుగు సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. భువనేశ్వరి ఉసురు జగన్‌కు తగులుతుందని తెలిపారు. సీఎం జగన్(CM Jagan).. చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తన పాపాలను కొంచెం అయినా తగ్గించుకోవాలని హితవు పలికారు.
Motkupalli Narasimhulu Reaction on Chandrababu Arrest: చంద్రబాబును ఏ ఆధారంతో అరెస్ట్ చేశారని మోత్కుపల్లి నిలదీశారు. ఆధారాలు, అనుమతులు లేకుండా అరెస్ట్ చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. కేవలం రూ.300 కోట్ల కోసం బాబు అవినీతి చేశారంటే అందరూ నవ్వుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తే ఆ రాజ్యం అంతా రావణకాష్ఠంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్‌కు వ్యతిరేకం కాదని.. అతని దుర్మార్గానికి, అరెస్ట్‌కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. త్వరలోనే తాను రాజమండ్రి వెళ్లి భువనేశ్వరిని, వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడతానని స్పష్టం చేశారు.