Mothers Right On Deceased Sons Property :మరణించిన కుమారుడి ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదని సంచలన తీర్పును ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. మరణించిన వ్యక్తి భార్య, పిల్లలకు మాత్రమే అతడి ఆస్తిపై హక్కు ఉంటుందని తీర్పును వెలువరించింది. 2012లో మరణించిన తన కుమారుడి ఆస్తిలో వాటా కావాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది.
ఇదీ జరిగింది..
తమిళనాడులోని నాగపట్టిణంకు చెందిన పౌలిన్ ఇరుదయ మేరీకి మోసెస్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. అతడికి 2004లో ఆగ్నస్ అనే మహిళతో వివాహం జరగగా.. ఓ కూతురు జన్మించింది. ఈ క్రమంలోనే 2012లో మోసెస్ మరణించాడు. అయితే, మోసెస్ మరణం తర్వాత.. అతడి ఆస్తిలో తనకు వాటా కావాలని కోరింది అతడి తల్లి మేరీ. ఈ మేరకు వాటా కావాలంటూ నాగపట్టిణం జిల్లా కోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మోసెస్ ఆస్తిలో మేరీకి సైతం వాటా ఉంటుందంటూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
జిల్లా కోర్టు తీర్పుపై మద్రాస్ హైకోర్టుకు..
నాగపట్టిణం జిల్లా కోర్టు తీర్పును వ్యతిరేకించిన మోసెస్ భార్య ఆగ్నస్.. మద్రాస్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ సుబ్రమణియన్, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్.. మరో న్యాయవాది పీఎస్ మిత్రా నేశా సహాయాన్ని కోరారు. "వారసత్వ చట్టం సెక్షన్ 42 ప్రకారం.. ఒకవేళ భర్త మరణిస్తే.. అతడి ఆస్తి భార్య, పిల్లలకు చెందుతుంది. భార్యాపిల్లలు లేని సమయంలో తండ్రికి ఆస్తి చెందుతుంది. తండ్రి లేని సమయంలోనే తల్లి, సోదరులు, సోదరిమణులకు ఆస్తిపై హక్కు ఉంటుంది" అని కోర్టుకు న్యాయవాది తెలిపారు. లాయర్ వ్యాఖ్యలతో న్యాయస్థానం ఏకీభవించింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మోసెస్కు సంబంధించిన ఆస్తిపై అతడి తల్లికి ఎలాంటి హక్కు ఉండదని తేల్చి చెప్పింది. మోసెస్ ఆస్తిపై అతడి భార్య ఆగ్నస్, కూతురికి మాత్రమే హక్కు ఉంటుందని తీర్పును ఇచ్చింది.
Mothers Right On Deceased Son Property : 'మరణించిన కుమారుడి ఆస్తిలో తల్లికీ వాటా.. ఆమె కూడా వారసురాలే'
ఐదేళ్ల చిన్నారి హత్యాచారం కేసు నిందితుడికి ఉరిశిక్ష- బాలల దినోత్సవం రోజే తీర్పు