తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇడ్లీ అమ్మ' కు కొత్త ఇల్లు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహీంద్రా

Anand Mahindra Idly Amma House: 'ఇడ్లీ అమ్మ'కు ఇల్లు కట్టించి ఆమె కల నెరవేర్చారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్​ మహీంద్రా. తమిళనాడుకు చెందిన కమలాత్తాళ్​కు సొంత ఇల్లు కట్టిస్తానని గతంలో ట్విట్టర్​ వేదికగా ఆయన ప్రకటించారు . ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కొత్త ఇంటిని కానుకగా ఇచ్చారు.

15231689
15231689

By

Published : May 9, 2022, 4:25 AM IST

Anand Mahindra Idly Amma House: ఎనిమిది పదుల వయసులో రూపాయికే ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న 'ఇడ్లీ బామ్మ' కమలాత్తాళ్‌ గుర్తుంది కదా! త్వరలో ఆమెకు సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా గతంలో ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. మాతృదినోత్సవం రోజున ఆమెకు కొత్త ఇంటిని కానుకగా అందజేశారు. గృహ ప్రవేశానికి సంబంధించిన దృశ్యాలు, ఈ మేరకు గతంలో చేసిన ట్వీట్‌లు, ఇంటి నిర్మాణ పనులతో కూడిన వీడియోను ఆదివారం ట్విటర్‌లో పంచుకున్నారు.

కొత్త ఇంటి దగ్గర ఇడ్లీ అవ్వ

'మాతృ దినోత్సవం నాటికి 'ఇడ్లీ అమ్మ'కు సొంత ఇంటిని బహుమతిగా అందించేందుకు సకాలంలో పనులు పూర్తి చేసిన మా బృందానికి కృతజ్ఞతలు. ఆమె.. నిస్వార్థం, దయ తదితర మాతృత్వ సద్గుణాల స్వరూపం. అమ్మకు, ఆమె పనికి మద్దతు ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాం. అందరికీ 'హ్యాపీ మదర్స్‌ డే'' అని ట్వీట్‌ చేశారు.

తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్‌ 37 ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తోంది. ఈ ఇడ్లీ బామ్మ గురించి 2019లో ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేయడం వల్ల అప్పట్లో ఆ కథనం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మహీంద్రా.. వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పారు.

మరో సందర్భంలో.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. నేటితో ఆ హామీని నెరవేర్చుకున్నారు. మరోవైపు.. మహీంద్రా దయాగుణంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'మీకు సెల్యూట్‌. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే గర్వపడేలా చేయాల'ని ఓ నెటిజన్‌ స్పందించారు. మీలాంటి కుమారుడు అందరికి రావాలని ఒకరు ఆకాంక్షించారు. మదర్స్‌ డే రోజు ఇడ్లీ అమ్మ ఆశీస్సులు పొందడం.. దేవుడి ఆశీస్సులు పొందడం లాంటిదేనని మరొకరు కామెంట్‌ పెట్టారు.

ఇదీ చదవండి:52 ఏళ్ల వయసులో 26వసారి ఎవరెస్ట్​ అధిరోహణ

ABOUT THE AUTHOR

...view details