తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం కోసం దారుణం.. కన్నతల్లిపై కిరోసిన్​ పోసి నిప్పు.. చికిత్స పొందుతూ.. - life sentence for rape convict

కేరళలోని త్రిస్సూర్​లో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు.. ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, బాలికను రేప్ చేసిన కేసులో ఓ కామాంధుడికి జీవిత ఖైదు విధించింది కోర్టు.

Mother torched alive by son
Mother torched alive by son for not giving money to drink alcohol dies

By

Published : Sep 22, 2022, 6:12 PM IST

Updated : Sep 22, 2022, 8:26 PM IST

మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు ఓ కుమారుడు. కిరోసిన్​ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్దురాలు మృతి చెందింది. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్​లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చమ్మన్నూర్ అనే గ్రామంలో నివాసం ఉంటోంది శ్రీమతి(75). ఆమెకు మనోజ్(53) అనే కుమారుడు ఉన్నాడు. అతడు తరచూ మద్యం తాగడానికి డబ్బులివ్వమని తల్లితో గొడవ పడేవాడు. అయితే బుధవారం మరోసారి అదే విధంగా అడిగాడు. డబ్బులు ఇవ్వడానికి తల్లి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన.. మనోజ్​ తల్లిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు మనోజ్​

85 శాతం కాలిన గాయాలతో ఆ మహిళను మొదటగా కున్నంకులంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో త్రిస్సూర్​లోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్సకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఎర్నాకులంలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆమె పరిస్థితి కోలుకోలేదు. పరిస్థితి విషమించడం కారణంగా బుధవారం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మనోజ్​ను అదుపులోకి తీసుకున్నారు.

కామాంధుడికి జీవిత ఖైదు..
అసోంలోని ఓ కామాంధుడికి కోర్టు.. జీవిత ఖైదు విధించింది. తనకు కోడలి వరుసయ్యే 11 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికిి తెగబడ్డాడు ఓ 31 ఏళ్ల వ్యక్తి. తర్వాత ఆ బాలిక చేతిలో రూ.100 నోటు, ఓ చిప్స్​ ప్యాకెట్​ చేతిలో పెట్టి పంపించాడు. నొప్పితో ఇంటికొచ్చిన బాలిక.. జరిగిందంతా తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి కొంతమందితో నిందితుడి ఇంటికి వెళ్లి.. జరిగిన దారుణంపై ప్రశ్నించింది. దీంతో కోపానికి గురైన నిందితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించాడు.

అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. ఛార్జ్​షీట్​ కోర్టుకు సమర్పించారు. కేసును విచారించిన కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. దాంతో పాటు రూ.లక్ష రూపాయలు జరిమానా విధించింది. తీర్పు సందర్భంగా.. "కేసు నుంచి నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీల్లేదు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలి. శిక్షా సమయంలో అతడికి పశ్చాతపం కలగాలి" అని కోర్టు వ్యాఖ్యానించింది.

వివాహిత బలవన్మరణం..
ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో దారుణం జరిగింది. యువకుడు, తన ఇద్దరు స్నేహితుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఓ వివాహిత. ఈ ఘటన జానక్​పుర్​ ప్రాంతంలో బుధవారం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. పూజ అనే వివాహితకు సోను అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పూజను పెళ్లి చేసుకోమని పూజను తరచూ వేధించేవాడు. ఇంతలో పూజ పెళ్లి అయిపోయింది. అయినా సోను వేధింపులు ఆగలేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే పూజ అత్తను, భర్తను చంపేస్తానని బెదిరించేవాడు సోను. దీంతో ఏం చేయాలో తెలియక, సోను వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది పూజ. సీలింగ్​ ఫ్యాన్​కు ఉరేసుకుని చనిపోయింది. అయితే ఇందులో హస్తం ఉన్న మరో ఇద్దరు నిందితులు విజయ్​పాల్​, రాహుల్​ పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు.

20 ఏళ్ల జైలు శిక్ష..
బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఓ కామాంధుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. పోక్సో చట్టం కింద ఈ శిక్ష వేస్తూ రాజస్థాన్​లోని ఝాలావార్​ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. బాలికను రేప్ చేశాడని 25 ఏళ్ల కన్హయ్యా లాల్​ అలియాస్ కన్హభిల్​పై 2020 ఆగస్టు 4న రాయ్​పుర్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. తాజాగా నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి :బాలికపై గ్యాంగ్​ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి.. 20 రోజులకు..

31 ఏళ్ల మౌన రోదన.. ఎట్టకేలకు ఫిర్యాదు.. సొంత అన్నపైనే రేప్​ కేస్​

Last Updated : Sep 22, 2022, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details