కశ్మీర్‌కు చెందిన దిల్షాదా- ఫయాజ్ అనే ముప్ఫై ఆరేళ్ల మహిళ మార్షల్ ఆర్ట్స్‌లో మూడేళ్లుగా శిక్షణ తీసుకుంటోంది. భర్త అందించిన ప్రోత్సాహంతో నాలుగు గోడల నుంచి బయటకు వచ్చిన దిల్షాదా తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. స్త్రీలపై ఆంక్షలు అధికంగా ఉండే కశ్మీర్‌లోనూ నిర్భయంగా శిక్షణ తీసుకుంటోంది. అలా మూడేళ్ల క్రితం తరగతులకు వెళ్లిన ఆమె కరాటేలో ప్రావీణ్యం సాధించి తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఓవైపు వ్యాపారం.. మరోవైపు మార్షల్ ఆర్ట్స్.. పతకాల పంట పండిస్తోన్న 'కశ్మీరీ మహిళ' - కశ్మీర్‌కు చెందిన మహిళ దిల్షాద్ ఫయాజ్ న్యూస్
వివాహంతో మహిళలు వంటింటికే పరిమితం అవ్వాలన్న ఆంక్షలను ఆ మహిళ ఒక్క పంచ్‌తో బద్దలు కొట్టింది. మార్షల్ ఆర్ట్స్ కేవలం యువతకే అన్న హద్దులను ఒక్క కిక్‌తో పటాపంచలు చేసింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో రాటుదేలి.. పతకాల పంట పండిస్తోంది. పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని.. ఆ మహిళ నిరూపిస్తోంది.
స్త్రీలకు రక్షణ లేని ప్రస్తుత సమాజంలో మార్షల్ ఆర్ట్స్‌తో స్వీయరక్షణ చేసుకోవచ్చనే ఆమె భావనే ఆమెను శిక్షణకు పురిగొల్పింది. అనుకున్నదే తడవుగా తన ఇద్దరి పిల్లలతో పాటే శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన నిర్ణయాన్ని భర్తతో చెప్పింది. భార్య ఆకాంక్షను ఆయన కాదనలేదు. అలా చేస్తే తనతో పాటు పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తావంటూ వెన్నంటి ప్రోత్సహించాడు. అలా మూడేళ్ల నుంచి పిల్లలతో పాటే ఆమె కరాటే తరగతులకు హాజరవుతోంది.
స్త్రీలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆకాంక్షించే దిల్షాదా.. ఒకవైపు మార్షల్ ఆర్ట్స్‌లో పతకాలు సాధిస్తూనే మరో వైపు భర్తతో పాటు వ్యాపారాన్ని చూసుకుంటూ.. కుటుంబాన్ని చక్కదిద్దుకుంటోంది. పాఠశాల తర్వాత అమ్మతోపాటే శిక్షణా తరగతులకు వెళ్తామని.. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు చదువులోనూ ముందుండాలని అమ్మ చెబుతుందని దిల్షాదా పిల్లలు చెబుతున్నారు. పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని నిరూపించిన దిల్షాదా.. వివాహంతో జీవిత లక్ష్యాలు, అభిరుచులు మరవద్దనీ పట్టుదలతో సాధించాలని చెబుతోంది.