కొన్ని దశాబ్దాల క్రితం కుటుంబ పరిస్థితులు, చదివించేవాళ్లు లేక చదవలేకపోయేవారు మహిళలు. మరి ఇప్పుడేమో రూ.లక్షల్లో ఖర్చుచేసి మరీ తమ పిల్లల్ని చదివిస్తున్నారు తల్లిదండ్రులు. అలాగే ఏ వయసులో చేయాల్సిన పనులు అప్పుడేే చేయాలని చెబుతున్నారు పెద్దలు. అయితే చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు బిహార్.. నలందాకు చెందిన శివర్తి దేవి అనే మహిళ. 45 ఏళ్ల వయస్సులో కూడా ఇంటిపనులు చూసుకుంటూ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాశారు.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బిహార్లో అక్షరాస్యత శాతం తక్కువే. మరీ ముఖ్యంగా మహిళా అక్షరాస్యత ఇంకా తక్కువ. 2009నాటికి బిహార్లో మహిళా అక్షరాస్యత 33 శాతమే. అయితే అక్షరాస్యతను పెంచేందుకు అప్పటి బిహార్ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల కోసం 'ముఖ్యమంత్రి అక్షర్ అంచల్ యోజన' పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మహిళలకు ప్రాథమిక పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ పరీక్షను నలుగురు కోడళ్లతో పాటు అత్త కూడా ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుని ప్రాథమిక పరీక్షను రాశారు. శివర్తి దేవితో పాటు ఆమె కోడళ్లు.. శోభా దేవి, సీమా దేవి, వీణా దేవి, బింది దేవి పరీక్ష రాశారు. నలందా జిల్లా వ్యాప్తంగా 9,698 మంది మహిళలు ఈ ప్రాథమిక పరీక్షను రాశారు.
ఈ పరీక్షను రాసేందుకు గత ఆరు నెలలుగా శిక్షణ తీసుకున్నారు ఈ మహిళలు. శిక్షణ పూర్తి కావడం వల్ల ఆదివారం వీరందరూ నలందా జిల్లా చండి గ్రామంలోని ఆదర్శ్ మధ్య విద్యాలయలో ప్రాథమిక పరీక్ష రాశారు. కాగా, కోడళ్లతో కలిసి అత్త పరీక్ష రాయడానికి రావడం వల్ల ప్రస్తుతం శివర్తి దేవి వార్తల్లో నిలిచారు. తమ అత్తతో కలిసి శిక్షణ తీసుకొని పరీక్ష రాయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు నలుగురు కోడళ్లు. ఈ వయసులో కూడా చదువు పట్ల శివర్తి దేవికి ఉన్న ఆసక్తి, అభిరుచిని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. అలాగే మిగతా మహిళలకు ఈమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.