ఉత్తర్‌ప్రదేశ్.. ఫిరోజాబాద్‌లో దారుణం జరిగింది. భర్తతో కలిసి బైక్‌పై గర్భిణీ వెళ్తుండగా ట్రక్కు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ రోడ్డుపైనే ఆడపిల్లకు జన్మనిచ్చి మరణించింది. దీంతో ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతురాలి గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే: ఆగ్రాకు చెందిన రాము అనే వ్యక్తి తన భార్య కామినిని తీసుకుని బైక్‌పై బుధవారం అత్తవారింటికి బయలుదేరాడు. కామిని గర్భిణీ. నారఖీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరతరా గ్రామ సమీపంలో వీరి బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో కామినికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ఆమె రోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పసిపాప క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు.