Mother Commits Suicide With children at Gandhinagar : పచ్చని సంసారంలో కలహాలు చిచ్చు రేపాయి. పండంటి ఇద్దరు పిల్లలు సహా.. తల్లి ప్రాణాలు తీశాయి. హైదరాబాద్ బన్సీలాల్‌పేట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అందంగా లేవని అవమానించటమే కాకుండా అదనపు కట్నం కోసం భర్త వేధింపులు భరించలేకే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని బాధిత కుటుంబం వాపోతోంది.
సిద్దిపేట జిల్లా రామాంచకు చెందిన 'వేమన్న-దుర్గమ్మ' దంపతులు 30 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి నలుగురు కుమర్తెలుండగా.. ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వేమన్న నలుగురు కూతుళ్ల పెళ్లిళ్లు ఘనంగా జరిపాడు. చివరి కుమర్తె సౌందర్యను మూడేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా కొండాపూర్‌కు చెందిన గణేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కట్నం కింద రెండున్నర లక్షల నగదు, 4 తులాల బంగారాన్ని ఇచ్చారు.
కుటుంబంతో ఉప్పల్‌లో ఉంటున్న గణేశ్ గాంధీ ఆస్పత్రి సమీపంలో ఓ క్షౌరశాలలో పనిచేస్తున్నాడు. మొదట్ల బాగానే ఉన్న వీరి కాపురంలో క్రమంగా గొడవలు మొదలయ్యాయి. గణేశ్-సౌందర్య దంపతులకు ఏడాదిన్నర క్రితం కవల పిల్లలు జన్మించారు. పిల్లలు పుట్టాక గణేశ్ వేధింపులు ఎక్కువయ్యాయంటూ సౌందర్య.. తల్లిదండ్రులతో చెప్పింది. వారు పలుమార్లు నచ్చజెప్పగా అత్తారింట్లోనే ఉండిపోయింది. పెళ్లి సమయంలో ఇస్తానన్న ప్లాట్ రాసివ్వాలంటూ గణేశ్ కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. 25రోజుల క్రితం పిల్లల్ని తీసుకుని సౌందర్య బన్సీలాల్‌పేట్‌లోని రెండు పడక గదుల సముదాయంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.
ఉదయం 11గంటల సమయంలో ఆటోలో భర్త పనిచేసే చోటుకు వెళ్లిన సౌందర్య ఆందోళనగా తిరిగి వచ్చింది. మధ్యాహ్నం పిల్లలకు భోజనం తినిపించి ఇంట్లో తల్లి దుర్గమ్మ నిద్రిస్తుండగా బిడ్డల్ని తీసుకుని ఎనిమిదో అంతస్తు పైకి వెళ్లింది. భవనసముదాయం పై నుంచి ఇద్దరు పిల్లల్ని కింద పడేసి తానూ దూకింది. శబ్ధం విన్న స్థానికులు అక్కడికి పరుగులు తీయగా అప్పటికే తీవ్రంగా గాయపడిన సౌందర్య, ఆమె పిల్లలు నిత్య, నిదర్శన్ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.
ఎంతో అపురూపంగా పెంచుకున్న బిడ్డ.. పండంటి కవల పిల్లల మృతదేహాలు చూసి సౌందర్య తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. గణేశ్ వేధింపులతోనే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: