Mother Jumps into Pond with Childrens in Medak : చిన్న చిన్న కలహాలు పచ్చని కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు జీవితాలకు శాపాలుగా మారుతున్నాయి. పరిష్కారం అయ్యే సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి మరణాలకు స్వాగతం పలుకుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలనూ.. ఆలూమగల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలతో చేజేతులా హతమార్చుకుంటున్నారు. వారితో పాటు అభం శుభం తెలియని చిన్నారులను సైతం చంపేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇద్దరు కుమార్తెలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన మెదక్ మండలం కొంటూరు గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మెదక్ డీఎస్పీ సైదులు తెలిపిన వివరాల ప్రకారం...మెదక్ మండలం వెంకటాపూర్‌కు చెందిన లక్ష్మీకి రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన కొక్కుల ఎల్లంతో ఏడేళ్ల కిందట వివాహమయింది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. తొమ్మిది రోజుల కింద భార్యాభర్తలిద్దరు గొడవ పడగా, భర్త ఎల్లం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో వెంకటాపూర్‌లోని తల్లిగారింట్లో ఉన్న భార్య లక్ష్మీ (28)మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసేందుకు తన ఇద్దరు కూతుళ్లు శరణ్య (4), శ్రావ్య (3)లతో మెదక్ వచ్చింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసిన తర్వాత ఆటోలో వెంకటాపూర్‌కు తిరిగి వెళ్లే క్రమంలో కొంటూరు వద్ద దిగింది. అక్కడి నుంచి వెంకటాపూర్‌కు వెళ్లకుండా తన ఇద్దరు కుమార్తెలతో సహా కొంటూరు పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన మెదక్ డీఎస్పీ సైదులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని చెరువులో నుంచి లక్ష్మీ, శరణ్య, శ్రావ్య మృతదేహాలను వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పరామర్శ :ఈ విషాదకర ఘటన గురించి తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ విషణ్ణ వదనంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల కోసం మృతుల కటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి :