మంటల్లో చిక్కుకొని తల్లీకూతుళ్లు సజీవ దహనమైన ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. గుడిసెకు నిప్పంటుకోవడం వల్ల ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ప్రభుత్వ అధికారులే గుడిసెకు నిప్పంటించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆక్రమించుకున్న స్థలంలో గుడిసెను నిర్మించారనే కారణంతో బాధిత కుటుంబంపై అధికారులు దాడి చేశారని.. కావాలనే గుడిసెకు నిప్పంటిచారని చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పుర్ దేహత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కృష్ణ గోపాల్ గుడిసె మంటల్లో కాలిపోయింది. ప్రమాదంలో కృష్ణ గోపాల్ భార్య.. ప్రమీలా దీక్షిత్, అతని కూతురు నేహ మంటల్లో సజీవ దహనం అయ్యారు. కృష్ణ గోపాల్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. బాధితులు కట్టుకున్న గుడిసెపై.. సోమవారం రెవెన్యూ అధికారులు దాడి చేశారు. అక్రమంగా గుడిసెను నిర్మించారని వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. కృష్ణ గోపాల్ స్థలాన్ని ఖాళీ చేయనందు వల్లే అధికారులు గుడిసెకు నిప్పంటించారని గ్రామస్థులు చెబుతున్నారు.