ఇంట్లోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి శిశువును బకెట్‌లో విడిచి వెళ్లింది ఓ తల్లి. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి చేరుకొని... బిడ్డను బాత్రూంలో విడిచివచ్చిన విషయాన్ని వైద్యులకు తెలిపింది. దీనిపై డాక్టర్లు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే శిశువు ఉన్న ఇంటికి వెళ్లిన పోలీసులు.. చిన్నారి ప్రాణాలను కాపాడారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ములకుజ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన ఇంట్లో శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆ చిన్నారిని బాత్రూంలో ఉన్న బకెట్‌లో విడిచిపెట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను గమనించిన ఆసుపత్రి వైద్యులు.. ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో విషయాన్ని మొత్తం డాక్టర్లకు చెప్పింది మహిళ. బిడ్డ చనిపోయిందని భావించి అక్కడ వదిలి వచ్చినట్లు వివరించింది. వెంటనే ఆ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు.
హుటాహుటిన యువతి ఇంటికి చేరుకున్న పోలీసులు.. బకెట్‌లో చిన్నారిని గుర్తించారు. శిశువు బతికే ఉండటాన్ని గమనించారు. ఆలస్యం చేయకుండా చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆ చిన్నారి కొట్టాయం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. వైద్యులు శిశువును ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించడం వల్ల.. చిన్నారి ప్రాణాలు నిలిచాయి. దీంతో పోలీసులు చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి.