అన్ని దానాల్లోకి గొప్పది రక్తదానం. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఎన్ని డబ్బులు ఇచ్చినా కొన్ని సార్లు దొరకదు. అలాంటి సమయాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన మధుర అశోక్ కుమార్ అనే మహిళ ఇప్పటివరకు ఏకంగా 117 సార్లు రక్తదానం చేశారు. తాజాగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి తన మంచి మనసును చాటుకున్నారు మధుర. ఆమె చేసిన సేవలకుగానూ ఇప్పటివరకు 180కి పైగా అవార్డులు వరించాయి. అలాగే తుమకూరులోని సిద్ధగంగ మఠాధిపతి సమక్షంలో మధుర అశోక్ కుమార్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. మఠంలోని వేలాది మంది చిన్నారులకు రక్తదానంపై అవగాహన కల్పించారు.
"రికార్డుల కోసం నేనెప్పుడూ రక్తదానం చేయలేదు. మా తండ్రి, మామయ్య స్వాతంత్ర్య సమరయోధులు. అందుకే నాకు సామాజిక సేవ పుట్టినప్పటి నుంచే అలవాటైంది. 18 ఏళ్ల నుంచే రక్తదానం చేయడం ప్రారంభించా. నేను ఆరోగ్యంగా ఉన్నంతకాలం రక్త దానం చేస్తా. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం పట్ల సంతోషంగా ఉంది."