ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri News) జరిగిన హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా (Ashish Mishra Bjp).. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు న్యాయబద్ధంగానే జరుగుతుందని హామీ ఇచ్చారు. నార్త్ బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయంలో ఎప్పటిలానే విధులకు హాజరైన ఆయన.. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. లఖింపుర్ ఖేరి ఘటనపై వివరించినట్లు తెలిపారు.
లఖింపుర్లో హింస జరుగుతున్న (Lakhimpur Violence News) సమయం తాను కానీ.. తన కుమారుడు కానీ ఆ ప్రాంతంలో లేమని చెప్పారు. విచారణలో భాగంగా ఏ ప్యానెల్ ముందైనా తాను హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
"లఖింపుర్ ఖేరిలో హింస చెలరేగినప్పుడు నేను, నా కుమారుడు ఆ ప్రాంతంలో లేము. మా కారు వేరే మార్గంలో వెళ్లింది. దీనిపై ఏ విచారణ ప్యానెల్ ముందు హాజరుకావడానికైనా సిద్ధంగా ఉన్నాను. నిందితులు ఎవరైతే వారి మీద కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో దాగి ఉన్న కుట్రను బయట పెట్టేందుకు దర్యాప్తు సంస్థలు తన పని ప్రారంభించాయి. ఈ కేసు విచారణలో ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేదు."
- అజయ్ మిశ్రా, కేంద్ర మంత్రి