తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిలో తమ్ముడి మృతదేహం.. మదిలో పుట్టెడు దుఃఖం.. రోడ్డుపక్కనే 8ఏళ్ల బాలుడు - మొరెనా న్యూస్​

Innocent with Dead Body: తనతో కలిసి సరదాగా ఆడుకోవాల్సిన తమ్ముడు.. ఒడిలో నిర్జీవంగా పడి ఉన్నాడు. కుమారుడి మృతదేహాన్ని ఎలా ఇంటికి తీసుకెళ్లాలో తెలియక.. పేద తండ్రి అందరినీ బతిమలాడుతున్నాడు. ఇలాంటి దయనీయ స్థితిలో అనేక గంటలపాటు రోడ్డు పక్కనే శవంతో ఏడుస్తూ కూర్చున్నాడు 8ఏళ్ల బాలుడు. ఎక్కడ? ఎందుకు?

MORENA SHAMED INNOCENT SITTING
MORENA SHAMED INNOCENT SITTING

By

Published : Jul 10, 2022, 3:39 PM IST

Innocent with Dead Body: చిన్నారి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని అనేక గంటలపాటు రోడ్డు పక్కనే ఏడుస్తూ కూర్చున్న 8 ఏళ్ల బాలుడ్ని చూసి.. మధ్యప్రదేశ్​ మురైనాలో అందరూ చలించిపోయారు. తమ్ముడ్ని కోల్పోయిన ఓ అన్న పడుతున్న బాధను, కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సరిపడా డబ్బులు లేక తండ్రి పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని అయ్యో అనుకున్నారు. చివరకు అంతా కలిసి అంబులెన్స్ ఏర్పాటు చేసి.. మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చారు.

ఇదీ జరిగింది..మధ్యప్రదేశ్​ మురైనా జిల్లా అంబాహ్ మండలం బడ్​ఫరా గ్రామానికి చెందిన పూజారామ్​ జాటవ్​కు నలుగురు పిల్లలు. 3-4 నెలల క్రితం భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను పూజారామ్ ఒక్కడే చూసుకుంటున్నాడు.​ రెండేళ్ల చిన్న కుమారుడికి కొంతకాలంగా ఆరోగ్యం బాగుండడం లేదు. రక్తహీనత, కడుపులో నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అంబాహ్ ఆస్పత్రి వైదులు.. మెరుగైన చికిత్స కోసం మురైనా జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఓ అంబులెన్స్ మాట్లాడుకుని పెద్దాస్పత్రికి వచ్చాడు పూజారామ్. అయితే.. దురదృష్టవశాత్తూ ఆ బాలుడు చనిపోయాడు.

బాలుడి దగ్గరకు వచ్చిన స్థానికులు

పూజారామ్​, అతడితోపాటు వచ్చిన 8 ఏళ్ల పెద్ద కుమారుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహంతో ఆస్పత్రి బయటకు వచ్చి.. ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే.. వారిని స్వగ్రామం నుంచి మురైనాకు తీసుకొచ్చిన అంబులెన్స్ అప్పటికే వెళ్లిపోయింది. మరో వాహనం కోసం ప్రయత్నిస్తే.. డ్రైవర్ రూ.1500 అడిగాడు. అంత సొమ్ము లేని పూజారామ్.. కాస్త తక్కువ ధరలో ఏమైనా దొరుకుతుందేమోనని వెతకడం ప్రారంభించాడు.

పెద్ద కుమారుడ్ని ఆస్పత్రి బయట రోడ్డు పక్కనే కూర్చోబెట్టి, అతడి ఒడిలో మృతదేహాన్ని పెట్టాడు పూజారామ్. తక్కువ డబ్బులకే స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు ఎవరైనా సహకరిస్తారన్న ఆశతో.. ప్రైవేటు వాహనాల డ్రైవర్లను బతిమలాడుతూ ఉన్నాడు. తమ్ముడు పోయాడన్న బాధ తప్ప పేదరికం కష్టాల గురించి సరిగా తెలియని పెద్ద కుమారుడు.. ఒడిలో మృతదేహంతో అలానే అనేగ గంటలపాటు కూర్చున్నాడు.

బాలుడ్ని ఓదారుస్తున్న స్థానిక వ్యక్తి

స్థానికులు వీరి బాధను గుర్తించారు. కానీ ఏం చేయలేకపోయారు. కాసేపటికి పోలీసులు వచ్చారు. కోత్వాలీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ యోగేంద్ర సింగ్.. చిన్నారి మృతదేహాన్ని, అతడి సోదరుడ్ని తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే కాసేపు మృతదేహాన్ని ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా పూజారామ్​ వచ్చాడు. చివరకు ఓ అంబులెన్స్​ను ఏర్పాటు చేసి.. మృతదేహాన్ని అతడి స్వస్థలానికి పంపించారు ఆస్పత్రి సిబ్బంది. అప్పటివరకు మాత్రం ఏం జరుగుతుందో తెలియక ఆ 8 ఏళ్ల బాలుడు.. ఏడుస్తూ ఉండిపోయాడు. ఇది స్థానికులను కంటతడి పెట్టించింది.

ఇవీ చూడండి:పక్షిని మింగేసిన పైథాన్​.. గట్టిగా పట్టుకుని వదలకుండా..

తీర్పు పేరిట ఉన్మాదం.. ఒకరు సజీవ దహనం.. దోషి అంటూ గ్రామస్థుల 'శిక్ష'!

ABOUT THE AUTHOR

...view details