More than 500 Babies Born on Shri Krishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బిహార్లో వందలాది మంది మహిళలు ప్రసవించారు. వీరిలో కొందరు పండుగ రోజునే బిడ్డను కనడం యాదృచ్ఛికం కాగా.. మరికొందరు 6, 7 తేదీల్లోనే ప్రసవం జరిగేలా చూడాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారట! ఇలా బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బిహార్లోని వేర్వేరు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 500 మందికిపైగా మహిళలు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇందులో 150 మంది రాజధాని పట్నాలోనే ఉన్నారు. బిహార్లో రోజంతా జరిగిన ప్రసవాలతో కలిపితే ఈ సంఖ్య 1000 దాటుతుందని వైద్యులు అంటున్నారు.
పండుగ రోజున తమ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాకతో తల్లిదండ్రులు, బంధువులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. శుభాకాంక్షలు చెప్పుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఫలితంగా బిహార్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కోలాహలం నెలకొంది.
ముహూర్తం పెట్టి మరీ..
శ్రీకృష్ణ జన్మాష్టమి లాంటి పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ప్రసవం జరిగితే బాగుంటుందని అనేక మంది భావిస్తుంటారు. కొందరు ఇందుకోసం వైద్యులపై ఒత్తిడి కూడా తెస్తుంటారు. ఈసారి కూడా అలానే జరిగిందని పట్నాకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్. సారికా రాయ్ తెలిపారు.
"హిందువులు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఆ రోజు పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. అలా జరిగితే భగవంతుడి ఆశీస్సులు లభించాయని అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలతో.. 4-5రోజులు ముందు లేదా ఆలస్యంగా ప్రసవం జరిగేలా చేయొచ్చు. కానీ.. డెలివరీకి ఇంకా 10-15రోజులు సమయం ఉన్నా.. కొందరు పండుగ రోజే ప్రసవం చేయాలని కోరారు. మేము అందుకు ఒప్పుకోలేదు. గర్భంలోని శిశువు పరిస్థితి చూశాకే ప్రసవం ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తాం. ముందస్తు డెలవరీలు చేయం." అని చెప్పారు డాక్టర్ సారికా రాయ్.