మహారాష్ట్రలో కరోనా కోరలు చాస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నడూ నమోదుకాని స్థాయిలో కొత్త కేసులు రావడం కలవరం రేపుతోంది. ఒక్కరోజే 15,817 పాజిటివ్ కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో మూడు నెలల తర్వాత ఫిబ్రవరిలో తొలిసారి 6 వేల కేసులు నమోదవగా.. కొద్ది రోజుల్లోనే ఆ సంఖ్య 16వేల మార్కుకు చేరువ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఒక్క ముంబయి నగరంలో 1,646 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక క్రియాశీల కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మరోవైపు ఈ రోజు 11,344 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో కరోనా పరిస్థితిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,73,10,586 శాంపిల్స్ పరీక్షించగా.. 22,82,191 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటివరకు 21,17,744 మంది కోలుకోగా.. 52,723 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,10,485 క్రియాశీల కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో రికవరీ రేటు 92.79% కాగా.. మరణాల రేటు 2.31%గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.