Arpita mukherjee news: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో అరెస్టయిన బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. గత శుక్రవారం ఈడీ జరిపిన సోదాల్లో ఆమె ఇంట్లో రూ.21కోట్లు బయటపడగా.. తాజాగా మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగించిన ఈడీ అధికారులు ఆమె అపార్ట్‌మెంట్‌లోని షెల్ఫ్‌లో నోట్ల కట్టలు గుర్తించినట్టు సమాచారం. వీటిని లెక్కించేందుకు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకురావాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అయితే, బుధవారం రాత్రి వరకు వాటిని లెక్కించిన అధికారులు.. రూ.20 కోట్లు ఉన్నట్లు తేల్చారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.
ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో గత శుక్రవారమే అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు.. శనివారం మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆమెనూ అరెస్టు చేశారు. వీరిద్దరికీ ఆగస్టు 3వరకు కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించడం వల్ల ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతున్న వేళ మళ్లీ భారీగా నోట్ల కట్టలు బయటపడటం గమనార్హం. అయితే, గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.21కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అక్రమంగా వచ్చిన డబ్బేనని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.